మంత్రులకు ముచ్చెమటలు పట్టించిన సీఎం బాబు..!

0
66

మంత్రులకు ముచ్చెమటలు పట్టించిన సీఎం బాబు..!

అన్నం తినకుండానే బయటికెళ్లిపోయిన మంత్రులు.!
మంత్రులకు ముచ్చెమటలు పట్టాయి…అధికారులు హైరానా పడ్డారు. వరుసగా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. సీనియర్ అధికారులు సైతం బిత్తర పోయారు. అధికారుల పట్ల మమకారం చూపించే చంద్రబాబులో 

ఎందుకంత కోపం వచ్చింది…పైగా ఆయన ఆగ్రహం సాదా, సీదా అధికారుల పై కాదు…

సాక్షాత్తు ఓ ఐపీఎస్ అధికారి పై….సాక్షాత్తు కేబినెట్ లోనే చంద్రబాబు ఆగ్రహం చవిచూసిన మంత్రులు, మారుమాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏమైందో..చంద్రబాబుకు ఎందుకంత కోపం వచ్చిందో ఈ స్టోరీలో చూడండి.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులంటే మమకారంగా ఉంటారు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంటే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు చెప్పిన మాటకు కూడా విలువ ఇస్తారు. గంటల తరబడి వాళ్లతో సమాలోచనలు చేస్తారు. ఇప్పుడు రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల అసల గొడవ అంతా ఇదే. అధికారులతో గంటల తరబడి సమావేశాలు నిర్వహిస్తూ చంద్రబాబు తమకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వటం లేదని తెలుగుదేశం నేతలు నెత్తి, నోరు బాదుకుంటున్నారు..అధికారులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వారి పైనే విరుచుకుపడ్డారు. అధికారులకు కూడా రీ కాల్ సౌకర్యం ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించే వరకు సీఎం వెళ్ళారంటే దాని వెనుక ఎంత కథ జరిగిందోనని ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికార వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతుంది. పైగా ముఖ్యమంత్రి అంత ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా సాదా, సీదా అధికారి పై కూడా కాదు. సిన్సియర్ అధికారిణిగా పేరున్న ఐపీఎస్ అధికారిణి, రాష్ర్ట హోమ్ సెక్రటరీ అనురాధ పై. ఆమెతో పాటు ఆయన డీజీపీ నండూరి సాంబశివరావు పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ర్టంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, అన్ని పట్టణాలను నిఘా నీడలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఫైల్ ను కేబినెట్ ముందుకు తీసుకురావాల్సి ఉంది. హోం శాఖ ఈ ఫైల్ ను కేబినెట్ కు పంపించాల్సి ఉంటుంది. గత కేబినెట్ లోనే ఈ ప్రతిపాదనను తీసుకురావాలని సీఎం కోరారు. అయితే సాంకేతిక పరమైన సమస్యలున్నాయని, ఫైల్ ను అప్పట్లో నిలిపివేశారు. కానీ గురువారం కేబినెట్ జరుగుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారమే ఈ ఫైల్ ను కేబినెట్ కు తీసుకురావాలని సీఎంఓ లో ఉండే ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎజెండాలో లేకపోయినప్పటికీ టేబుల్ ఐటమ్ గా పెట్టాలని కూడా సీఎం తన పేషీకి సూచించారు. అయితే ఈ ఫైల్ కోసం సీఎంఓ అధికారులు ఆరా తీశారు. నెల రోజుల పర్యటన కోసం హోం సెక్రటరీ అనురాధ అమెరికా వెళ్ళారు. ఆమె వెళ్లే సమయంలో ఈ ఫైల్ ను లాక్ అండ్ కీలో బీరువాలో పెట్టుకుని వెళ్ళిపోయారని అధికార వర్గాలు సీఎంఓకి సమాచారం అందించాయి.

తీరా గురువారం కేబినెట్ ఏజెండాలో ఈ అంశం లేకపోవటం, టేబుల్ ఐటమ్ గా కూడా తీసుకురాకపోవటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు టేబుల్ ఐటమ్స్ జాబితాను చూసి సీసీ టీవీ కెమెరాల గురించి ఆరా తీశారు. ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. అధికారులు నీళ్లు నమలటంతో సీఎం మరోసారి గట్టిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్ధాయిలో తాను చెబితే కూడా కేబినెట్ కు తీసుకురారా అని మండిపడ్డారు. సీఎం ఆగ్రహాన్ని చూసిన అధికారులు హోం సెక్రటరీ లేరని, ఫైల్ ఆమె లాక్ అండ్ కీలో ఉంచారని చెప్పటంతో సీఎం ఆగ్రహం రెట్టింపు అయ్యింది. ఒక్కసారిగా మండిపడ్డారు. ఒక అధికారి లేకపోతే వ్యవస్ధ మొత్తం ఆగిపోతుందా అని ఆయన ఉన్నతాధికారుల పై విరుచుకుపడ్డారు. అధికారులకు కూడా రీ కాల్ ఉంటే బాగుంటుందని సూచించారు. టెక్నాలజీ అని తాను పరుగులు తీస్తుంటే అధికారులు మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరో వివరణ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ కోపం అంతటితో ఆగకుండా పాఠశాలల రేషన్ లైజేషన్ విషయంలో కూడా సీఎం మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. రేషన్ లైజేషన్ పేరిట నాలుగు వేల పాఠశాలలను మూసివేయటం ఏమిటని నిలదీశారు.

ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మీరు ఎందుకు గమనించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. పది మంది పిల్లలు లోపు ఉన్న పాఠశాలలనే మూసివేస్తున్నామని చెప్పగా, ఆ విషయాన్ని ముందే ఎందుకు ప్రజలకు చెప్పి మానసికంగా సిద్ధం చేయలేకపోయారని సీఎం ఆగ్రహంగా ప్రశ్నించారు. కొంత మంది మంత్రులకు శాఖల పై ఇంకా అవగాహన రావడం లేదని, భవిష్యత్ లో ఇటువంటి పరిస్థితి ఉంటే తాను సహించనని చంద్రబాబు మంత్రులకు క్లాస్ పీకారు. అటు అధికారులు, ఇటు మంత్రులపై చంద్రబాబు విరుచుకుపడటంతో ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం సగం మంది లంచ్ కూడా చేయకుండా బ్రతుకుజీవుడా అంటూ బయటపడిపోయారు. పేషీలకు వచ్చి, భోజనం చేసి, కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటే కానీ సీఎం ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ నుంచి తేరుకోలేకపోయారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here