ఆటగాడిగా అనిల్‌ కుంబ్లేది 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం

0
61

అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాడిగా అనిల్‌ కుంబ్లేది 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఏడాది కిందట టీమ్‌ఇండియా కోచ్‌గా ఎంపికైనపుడు ఆ పదవిలోనూ దీర్ఘ కాలం కొనసాగుతాడనే అనుకున్నారు.. కానీ కుంబ్లే ఏడాదికే నిష్క్రమించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీతో తన ఏడాది పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో.. అంతటితోనే తన ప్రస్థానాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. వెస్టిండీస్‌ పర్యటనకూ కోచ్‌గా కొనసాగాలని బోర్డు కోరినా, కోచ్‌ పదవికి మళ్లీ రేసులో నిలిచే అవకాశం ఉన్నా.. కుంబ్లే మాత్రం తక్షణం కోచ్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు పదవిలో కొనసాగే ఉద్దేశం లేదని బోర్డుకు స్పష్టం చేశాడు. అయితే కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే కెప్టెన్‌ కోహ్లితో విభేదాలే కుంబ్లే నిష్క్రమణకు కారణమని స్పష్టమైంది. ఈ విషయాన్ని కుంబ్లేనే సూటిగా చెప్పాడు. కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తనకు తెలపడంతో తానీ నిర్ణయం తీసుకుంటున్నట్లు కుంబ్లే స్పష్టం చేశాడు.
కొత్త కోచ్‌ పదవి ఎంపికపై ఇంకా ఏం తేల్చుకోని నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం ఇంకో రెండు వారాల పాటు పదవిలో కొనసాగాలని, వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాలని బోర్డు కుంబ్లేను కోరింది. ఇందుకతను సానుకూలంగానే స్పందించినట్లు వార్తలొచ్చాయి. కానీ లండన్‌ నుంచి వెస్టిండీస్‌కు బయల్దేరిన భారత జట్టుతో కుంబ్లే కలవలేదు. ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌ హోదాలో లండన్‌లో జరుగుతున్న మండలి వార్షిక సమావేశంలో పాల్గొంటున్న కుంబ్లే.. ఈ నెల 23 వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తాను వెస్టిండీస్‌కు వెళ్లట్లేదని, కోచ్‌ పదవి నుంచి తప్పుకుంటున్నానని బోర్డుకు సమాచారం ఇచ్చాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here