ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల దస్త్రంపై ప్రధాని సంతకం

0
49

ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఏకీకృత సర్వీసుల దస్త్రంపై ప్రధాని సంతకం చేశారు. మంగళవారం లఖ్‌నవూ పర్యటనకు వెళ్లేముందు ప్రధాని నరేంద్రమోదీ ఈ ఫైలుపై సంతకం చేసి రాష్ట్రపతి భవన్‌కు పంపారు. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన వెంటనే ఇదివరకున్న ఉత్తర్వులను సవరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గత కొన్నిరోజులుగా ఈ అంశంపై దృష్టిసారించడంతో దస్త్రం చకచకా పరుగులు తీసింది. ఈనెల 14న ఆయన హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కలిసి సమస్య తీవ్రతను వివరించారు.

తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయని, ఉపాధ్యాయుల పదోన్నతులు, ఇతర అంశాలు ఈ దస్త్రంతో ముడిపడినందున సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటికప్పుడే రాజ్‌నాథ్‌సింగ్‌ హోంశాఖ కార్యదర్శిని పిలిపించి రాత్రికల్లా దస్త్రాన్ని పరిశీలించి రాష్ట్రపతికి పంపాలని ఆదేశించారు. ఈ క్రమంలో 15న హోంశాఖ దస్త్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపింది. దీనిపై సోమవారం వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శితో మాట్లాడినప్పుడు దీనిపై తాను సంతకం చేశానని, రాత్రికల్లా ప్రధాని చేవ్రాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అనుకున్నట్లుగానే మంగళవారం ప్రధాని మోదీ ఈ దస్త్రంపై సంతకంచేసి రాష్ట్రపతి భవన్‌కు పంపారు. అక్కడ ఆమోదముద్ర పడగానే ఈ అంశానికి మోక్షం లభించనుందని అధికారులు తెలిపారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం ముగిసే జులై 24లోపే తుది ఉత్తర్వులు వెలువడతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here