ప్లాస్టిక్ రైస్ – మీడియా అత్యుత్సాహం

0
173

ఎప్పుడూ లాగానే కేవలం సెన్సేషన్ కోసం తప్ప నిజాలతో పనిలేకుండా పనిచేసే మీడియా ప్లాస్టిక్ రైస్ విషయంలో కూడా అలాగే ప్రవర్తించింది. కనీస హేతుబద్ధ విశ్లేషణ చెయ్యకుండా ‘ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ రైస్’ అంటూ ఊదరగొట్టి ప్రజలను భయకంపితులను చేసింది. ప్లాస్టిక్ రైస్ సాధ్యాసాధ్యాలను ఒకసారి హేతుబద్దంగా పరిశీలిస్తే..

 

 

1) ఫిజిక్స్ : బియ్యం సాంద్రత ప్లాస్టిక్ కన్నా ఎక్కువ అందువల్ల ఒక కిలో బియ్యం సైజు కన్నా ఒక కిలో ప్లాస్టిక్ సైజు చాల ఎక్కువ ఉండటం వల్ల సాధారణ పౌరులెవరయినా వాటిని పసిగట్టేయగలరు. బియ్యం వండే ముందు నీళ్లలో పోసి కడుగుతారు. బియ్యం సాధారణంగా నీళ్లలో మునుగుతాయి. ఒకవేళ అవి ప్లాస్టిక్ తో చేసినట్లయితే అవి మునగవు. అక్కడే ఏమాత్రం చదువు లేనివాళ్లకు కూడా అర్థం అయిపోతుంది.

2) ఎకనామిక్స్ : కిలో బియ్యం కన్నా ప్లాస్టిక్ ఖరీదు ఎక్కువ అవటం వల్ల ప్లాస్టిక్ బియ్యం ఎవరూ తయారు చేసి లాభాలు ఆర్జించలేరు. ఎవరు ఏ వస్తువునయినా కల్తీ చేస్తున్నారు అంటే లాభాలకోసమే తప్ప తానూ నష్టపోవడానికి చెయ్యరు. ఒకవేళ ఎవరన్నా బియ్యం ధరకు ప్లాస్టిక్ అమ్మితే ప్లాస్టిక్ వస్తువుల తయారీదారులు టన్నులలో ధర చెల్లించి కొనడానికి సిద్ధంగా ఉన్నారు. బంగారం రాగి కలిపి అమ్ముతారు తప్ప రాగిలో బంగారం కలిపి అమ్మరు.

3) రేషనాలిటీ : ప్లాస్టిక్ వస్తువులను తయారుచేయడానికి ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తయారుచేస్తారు. ఆ గ్రాన్యూల్స్ వివిధ కంపెనీలు తీసుకెళ్లి రకరకాల వస్తువులను తయారుచేస్తాయి. ఈ గ్రాన్యూల్స్ తయారుచేసే మిషన్ల వీడియోలను పోస్ట్ చేసి వాటిని ప్లాస్టిక్ బియ్యం చేసే యంత్రాలుగా సోషల్ మీడియాలో, టెలీకాస్ట్ చేసి ఎలక్ర్టానిక్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి భయపెడుతున్నారు.

4) సిస్టం : ఒకవేళ నిజంగా చైనా నుండి ప్లాస్టిక్ బియ్యం ఇంత ఎత్తున దిగుమతి అవుతుంటే మన నిఘా వ్యవస్థ కళ్ళు మూసుకొని కూర్చోదు. వ్యవస్థ ఎంత అవినీతితో నిండినా కనీస భాద్యతను మన వ్యవస్థ ఇంకా కలిగిఉంది.

5) పాలిటిక్స్ : ప్రజలలో శాస్త్రీయ దృక్పధం కన్నా మూఢ విశ్వాలు ఎక్కువగా ఉంటే రాజకీయ పార్టీలు వారిని తేలికగా మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొన్ని రాజకీయాలు చేసే సంస్థలు ఇటువంటి విషయాలు ప్రచారం చెయ్యటం వాటికి దేశభక్తి ముసుగు వెయ్యటం సహజం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

కాబట్టి ప్రజలు ఎలక్ట్రానిక్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రచారం అయ్యే విషయాలను గుడ్డిగా నమ్మకుండా వాటిని హేతుబద్దంగా విశ్లేషించి అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా మీకు ఇంకా ప్లాస్టిక్ బియ్యం అని నమ్మకం ఉంటే ఒక్కసారి వాటిని ల్యాబ్ కి పంపి టెస్ట్ చేయించుకొని అనుమానాలను నివృత్తి చేసుకోవాలి.

నోట్ : ప్లాస్టిక్ బియ్యం సాధ్యం కాదు అనంటే కల్తీ బియ్యం లేవు అని కాదు. బియ్యాన్ని మరో రకంగా కల్తీ చేసే అవకాశం ఉంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here