పెద్ద నోట్ల రద్దుతో లాభనష్టాలు

0
57

పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కూరుకుపోయిన కోటాను కోట్ల రూపాయల నల్ల డబ్బును వెలికి తీయవచ్చని, పెరుగుతున్న అవినీతిని అరికట్టవచ్చని, టెర్ర రిజాన్ని ప్రోత్సహిస్తున్న నకిలీ కరెన్సీని నామ రూపాలు లేకుండా చేయవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడు ప్రయోజనాలను వివరించారు. ఆ తర్వాత దేశాన్ని డిజిటల్‌ లావాదేవీల దిశగా తీసుకెళ్లడం కూడా మరో ముఖ్యమైన ప్రయోజనమని చెప్పారు. మరి పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ ప్రయోజనాలు ఎంత మేరకు నెరవేరాయో భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) బుధవారం నాడు విడుదల చేసిన లెక్కలను విశ్లేషించి సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
దేశ కరెన్సీలో 86 శాతం ఆక్రమించిన 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు బ్యాంకులకు తిరిగి రాకపోవచ్చని ఇటు ఆర్బీఐ, అటు ప్రభుత్వ పెద్దలు భావించారు. చివరకు బ్యాంకులకు తిరిగిరాని సొమ్మెంతంటే దాదాపు 16వేల కోట్ల రూపాయలు. రద్దు చేసిన పెద్ద నోట్లలో 99 శాతం, అంటే 15.28 లక్షల కోట్ల రూపాయలు జూన్‌ 30వ తేదీ నాటికి బ్యాంకులకు చేరాయని ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకులకు చేరిన సొమ్మంతా తెల్లడబ్బని భావించలేమని, అందులో మూడు లక్షల డిపాజిట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమర్థించుకున్నారు.

మూడు లక్షల డిపాజిట్లను స్క్రూటిని చేసి, నోటీసులు పంపి, కేసులు విచారించి డిపాజిట్‌ దారుల నుంచి డబ్బును రాబట్టేందుకు ఎంత మంది సిబ్బంది అవసరమో, దానికి ఎన్నేళ్లు పడుతుందో ఆర్థిక మంత్రికి తెలియందీ కాదు. సాధారణ లావాదేవీలను తనిఖీ చేసేందుకే సిబ్బంది కొరతతో బాధ పడుతున్న ఆదాయం పన్ను శాఖ మూడు లక్షల డిపాజిట్లను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు కనీసం నాలుగేళ్లయినా పడుతుందని ఆర్థిక నిపుణులే తెలియజేస్తున్నారు.

పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశంలో పన్ను చెల్లింపుదారులు పెరిగారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. 91 లక్షల మంది పెరిగారని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించగా, 33 లక్షల మంది పెరిగారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 5.1 లక్షల మంది పెరిగారని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇందులో ఎవరి లెక్కలు సరైనవి? ఆర్థిక మంత్రి చెప్పారు, పైగా పెద్ద సంఖ్య చెప్పారుగా అని 91 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరిగారని భావిద్దాం. ఇక్కడ పన్ను చెల్లింపుదారులంటే రిటర్న్స్‌ దాఖలు చేసిన వారి సంఖ్య మాత్రమే. వారిలో పన్ను పరిమితి లోపు, అంటే సంవత్సరాదాయం రెండున్నర లక్షల లోపు ఉన్న వినియోగదారులు ఎన్ని లక్షల మంది ఉన్నారో! వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదుగదా?

అలాంటప్పుడు రిటర్న్స్‌ పెరగడం వల్ల ప్రభుత్వానికి వచ్చేదెంత? గతేడాదితో పోలిస్తే ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల, పాన్‌ కార్డుతో ఆధార్‌ కార్డును ముడి పెట్టడం వల్ల సహజంగానే రిటర్న్స్‌ పెరుగుతాయికదా! పెద్ద నోట్ల రద్దు ద్వారా దాదాపు 400 కోట్ల నకిలీ కరెన్సీని పట్టుకోవచ్చని, ఫలితంగా కశ్మీర్‌లో టెర్రరిస్టు కార్యకలాపాలను నిర్మూలించవచ్చని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఈ పది నెలల కాలంలో దేశంలో కేవలం 11.23 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీని పట్టుకున్నట్లు ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. ఇక కశ్మీర్‌లో కల్లోల పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. మరో ముఖ్యవిషయం సమాజంలో అవినీతిని నిర్మూలించవచ్చ వచ్చని చెప్పారు.

అవినీతి తగ్గకపోగా పెరిగిందని, భూములు, ఇళ్లు, లగ్జరీ వాచ్‌లను బహుమతులుగా ఇవ్వడం, విలాసవంతమైన విదేశీ పర్యటనలను ఏర్పాటు చేయడం ద్వారా లంచాలు కొనసాగుతున్నాయని మ్యాక్‌ కిన్‌సే ఇటీవలనే ఓ నివేదికలో వెల్లడించింది. నగదు లావాదేవీలు బాగా తగ్గిపోయి డిజిటల్‌ లావా దేవీలు బాగా పెరుగుతాయని భావించారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా నగదు అందుబాటులో లేకుండా పోయినప్పుడు నిజంగానే బాగా పెరిగాయి. నగదు మళ్లీ అందుబాటులోకి రావడంతో బాగా తగ్గిపోయాయి. మే, జూన్‌ నెలల్లో డిజిటల్‌ లావాదేవీలు 27 శాతంగా నమోదయ్యాయి. ఏడు శాతానికి మించి పురోగతి లేదు. ఆశించిన లాభాలు ఒనగూడాయో, లేదో తేల్చి చెప్పడానికి ఈ లెక్కలన్నా అందుబాటులో ఉన్నాయి.

పెద్ద నోట్ల రద్దు వల్ల దెబ్బతిన్న చిల్లర, చిన్న వ్యాపారస్థుల సంఖ్య ఎంత? వారు నష్టపోయిన వ్యాపారం విలువ ఎంత? రైతులు చిరు ధాన్యాలను, కూరగాయలను అమ్ముకోలేక నష్టపోయింది ఎంత? మరో పంటకు విత్తనాలను కొనలేక పంటను వేయని రైతులు ఎంత మంది? వారు నష్టపోయింది ఎంత? బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నిలబడి, నిస్సత్తువతో చనిపోయిన వారి సంఖ్య ఎంత? మూడు నెలలపాటు కూలి, నాలి దొరక్క ఆర్థాకలితో అలమటించి మరణించిన అభాగ్యుల సంఖ్య ఎంత ? దేశ కరెన్సీలో 86 శాతం నగదును రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త కరెన్సీని ముద్రించడానికి అయిన ఖర్చు ఎంత? వాటిని సంబంధిత బ్యాంకులకు, బ్రాంచ్‌లకు తరలించేందుకు అయిన ఖర్చు ఎంత ? ఈ లెక్కలు ఎవరి తేల్చి చెబుతారు?

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here