మళ్ళి తిరిగి గోపీచంద్‌ వద్దకి సైనా…

0
65

హైదరాబాద్‌: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మరోసారి కలిసి పని చేయనున్నారు. మూడేళ్ల క్రితం అభిప్రాయ భేదాల కారణంగా గోపీచంద్‌తో విడిపోయిన సైనా… బెంగళూరులో కోచ్‌ విమల్‌ కుమార్‌ వద్ద శిక్షణ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ గోపీచంద్‌ అకాడమీలో కోచింగ్‌కు ఆమె సన్నద్ధమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్‌ చేసింది. ‘కొంత కాలంగా నా శిక్షణను గోపీచంద్‌ అకాడమీకి మార్చే విషయం గురించి ఆలోచిస్తున్నాను. దీని గురించి గోపీ సర్‌తో చర్చించాను. నాకు మళ్లీ సహకరించేందుకు అంగీకరించిన ఆయనకు కృతజ్ఞతలు. కెరీర్‌లోని ఈ దశలో నా లక్ష్యాలు అందుకునేందుకు ఆయన సహకారం అవసరమని భావిస్తున్నా. సొంత నగరం హైదరాబాద్‌కు తిరిగి రావడం సంతోషంగా ఉంది’ అని సైనా వ్యాఖ్యానించింది.

2014 సెప్టెంబర్‌ నుంచి తనకు శిక్షణ ఇచ్చి రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలు గెలుచుకోవడంతో పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌గా ఎదిగేందుకు సహకరించిన విమల్‌ కుమార్‌కు కూడా ఈ సందర్భంగా సైనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సైనా రాకను గోపీచంద్‌ కూడా నిర్ధారించారు. ‘సైనా తిరిగి రావడం మంచి పరిణామం. ఆమె రాకపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గత శుక్రవారం నుంచే ఆమె అకాడమీలో ట్రైనింగ్‌ ప్రారంభించింది. ఇకపై మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తాం’అని గోపీచంద్‌ అన్నారు. మరోవైపు జాతీయ సింగిల్స్‌ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన ముల్యో హండోయో ఎంపిక కూడా సైనా పునరాగమనానికి కారణమైంది. ‘బాయ్‌’ సింగిల్స్‌ శిబిరానికి గోపీచంద్‌ అకాడమీనే కేంద్రం కావడంతో… ముల్యో వద్ద శిక్షణ పొందాలంటే సైనా తప్పనిసరిగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ తర్వాత సైనా తనతో ఈ విషయం గురించి చర్చించిందని… మంచి ఫలితాల కోసం ఎక్కడికి వెళ్లినా తప్పు లేదంటూ తాను ఆమెను ప్రోత్సహించినట్లు విమల్‌ వెల్లడించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here