వెల్లడైన నల్లధనం రూ. 4900 కోట్లు

0
336

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనా (పిఎంజికెవై) కింద మొత్తం 21000 మంది 4,900 కోట్ల రూపాయల నల్లధనాన్ని వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు ఈ వివరాలు తెలిపారు. పెద్దనోట్ల రద్దును ప్రకటించిన తర్వాత నల్లధనం వెల్లడి కోసం ఆఖరు అవకాశంగా ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనా స్కీమ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. 2016 డిసెంబరులో ప్రకటించిన ఈ స్కీమ్‌కు గడువు తేదీ ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఈ స్కీమ్‌ కింద వెల్లడించిన అక్రమ సంపాదనలో 50 శాతాన్ని పన్నులు, పెనాల్టీల కింద చెల్లించి, మరో 25 శాతాన్ని ప్రభుత్వ దగ్గర వడ్డీ లేకుండా నాలుగేళ్ల కాలానికి డిపాజిట్‌ చేస్తే సరిపోతుంది. మరో 25 శాతం సొమ్మును నల్లధనం వెల్లడించిన వారు దర్జాగా ఎంజాయ్‌ చేయవచ్చు. ప్రభుత్వం దీనిని బంపర్‌ ఆఫర్‌గా భావించినప్పటికీ నల్లధనవంతులు మాత్రం ఆ విధంగా తీసుకున్నట్టు లేదు. 4,900 కోట్ల రూపాయల మొత్తాన్ని వెల్లడించిన ఈ 21 వేల మంది నుంచి ఇప్పటి వరకు 2,451 కోట్ల రూపాయల మేర మాత్రమే పన్ను వసూలైంది. ప్రభుత్వం ఆశించిన దాని కంటే ఈ స్కీమ్‌కు లభించిన స్పందన చాలా తక్కువగా ఉందన్న విషయం ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా స్కీమ్‌ గడువు ముగిసిన తర్వాత అంగీకరించారు. అయితే ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాత్రం దీనితో ఏకీభవించలేదు. గతేడాది మొదట్లో ఒక స్కీమ్‌ను ప్రకటించిన కారణంగా రెండో స్కీమ్‌కు స్పందన ఎక్కువగా ఉండకపోవడం సహజమేనని అన్నారు. గతేడాది ప్రభుత్వం నల్లధనాన్ని వెలికితెచ్చేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేసింది. మొదట స్వచ్ఛంద వెల్లడి పథకం పేరుతో ఒక స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. 2016 జూన్‌లో ప్రారంభమైన ఈ స్కీమ్‌ సెప్టెంబరులో ముగిసింది. ఈ స్కీమ్‌ కింద 71,726 మంది లెక్కల్లో చూపని 67,382 కోట్ల రూపాయల సొమ్ము వివరాలను బయటపెట్టారు. ఈ స్కీమ్‌ కూడా ప్రభుత్వం కోరుకున్నంత భారీ స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఈ స్కీమ్‌ కింద ఇప్పటి వరకు వసూలైన పన్నుల మొత్తం 12,700 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ స్కీమ్‌ ముగిసిన రెండు నెలల్లోనే నవంబరు 8న ప్రభుత్వం 1000, 500 రూపాయల నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. నల్లధనం అంతుచూసేందుకే నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించామని చెప్పిన ప్రభుత్వం డిసెంబరులో ఆఖరు అవకాశంగా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనను ముందుకు తెచ్చింది. పెద్ద ఎత్తున నల్లధనాన్ని 1000, 500 రూపాయల నోట్ల రూపంలో దాచుకున్నవారంతా ఈ స్కీమ్‌ను ఉపయోగించుకుంటారని భావించారు. చివరలో లెక్కలు చూస్తే రద్దయిన నోట్లలో 98 శాతం బ్యాంకుల్లోకి వచ్చినట్టుగా స్పష్టమైంది. ఆర్థిక రంగంలో కనీసం 4-5 లక్షల కోట్ల రూపాయల మేర నల్లధనం కేవలం నగదు రూపంలోనే ఉంటుందని అంచనాలు వేసుకున్న కారణంగా పెద్ద నోట్ల రద్దు వల్ల, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన స్కీమ్‌ వల్ల పెద్ద ఎత్తున చీకటిసొమ్ము వెలుగులోకి వస్తుందని ఎదురు చూసిన ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. ఇప్పుడు డొల్ల కంపెనీలను వెంటాడే ప్రయత్నంలో ఉంది. రెండు లక్షలకు పైగా కంపెనీలను డీ రిజిస్టర్‌ చేశారు. ఈ కంపెనీల్లో అత్యధిక భాగం మనీలాండరింగ్‌కు ఉపయోగపడుతున్న డొల్ల కంపెనీలన్నది సర్కారు అనుమానం. ఈ డొల్ల కంపెనీల గుట్టు తేల్చితే భారీ ఎత్తున నల్లధనం ఆచూకీ దొరుకుతుందన్న అభిప్రాయంలో ప్రభుత్వ వర్గాలున్నాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here