లోక్‌సభ సీటుపై కన్నేసిన యువ నేత..!

0
36

గుంటూరు: ప్రముఖ విద్యా సంస్థల అధినేత వారసుడు రాజకీయ అవతారమెత్తాడు. జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. అడుగుపెట్టిన అనతికాలంలోనే గుంటూరు లోక్‌సభ సీటుపైనే కన్నేశాడు. ఆర్థిక బలం మెండుగా ఉండటంతో ఆయనకే సీటు ఖాయమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ యువ కిశోరం ఎవరో కాదు… విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య తనయుడు శ్రీకృష్ణదేవరాయలు. డాక్టర్‌ రత్తయ్య గత ఎన్నికల సమయంలోనే వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందే పార్టీలో చేరినప్పటికీ పోటీ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయనప్పటికీ వైసీపీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించారు. పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఇస్తానని పార్టీ అధినేత అప్పట్లో హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. పార్టీ అధికారంలోకి రాకపోవటంతో ఆయన ఆశ నెరవేరలేదు.
విశేషమేమిటంటే 2014 ఎన్నికలకు చాలా కాలం ముందట గుంటూరు లోకసభ స్థానానికి తొలుత తెలుగుదేశం అభ్యర్థిగా రత్తయ్య పేరు వినిపించింది. అయితే పోటీ చేసేందుకు ఆయన ఇష్టత చూపలేదు. ఆ తరువాతే పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్‌ పేరు తెరపైకి రావడం, సీటు దక్కించుకోవటం జరిగాయి. ఆ తరువాత ఆయన నరసరావుపేట సీటు ఆశించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉండి గుంటూరు ఎంపీగా కొనసాగుతున్న రాయపాటి సాంబశివరావు చకచకా పావులు కదిపి టీడీపీలోకి చేరి నరసరావుపేట లోకసభ స్థానాన్ని దక్కించుకొని విజయకేతనం ఎగురవేశారు. నరసరావుపేట సీటు దక్కలేదనే కోపంతోనే రత్తయ్య హడావిడిగా మాజీ ఎంఎల్‌ఏ రావి వెంకటరమణ ఆధ్వర్యంలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరినప్పటికీ క్రియాశీలక రాజకీయాలకు రత్తయ్య దూరంగా ఉంటూ వచ్చారు.
తండ్రి ఆశీస్సులతో…
ఈ క్రమంలో తండ్రి ఆశీస్సులతో కృష్ణదేవరాయలు కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలలో నిమగ్నమయ్యారు. గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే వైసీపీ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా మారిపోయారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండడంతో కృష్ణదేవరాయలకు మార్గం సుగమమైనట్లు సమాచారం.
రెండు స్థానాలకు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితే..
గుంటూరు లోక్‌సభ స్థానానికి అభ్యర్థి దొరికాడని ఈ స్థానం పరిధిలో పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు సంబరపడు తుండగా…. నరసరావుపేట, బాపట్ల లోకసభ స్థానాల పరిధిలోని ఎంఎల్‌ఏ ఔత్సాహికుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఆనాటి నుంచి పత్తాలేకుండా పోయారు. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్ధుల విషయంలో కాంగ్రెస్‌ పరిస్థితికి తీసిపోని విధంగా వైసీపీ పరిస్థితి నెలకొని ఉంది

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here