టిడిపిలోకి నల్లారి,వ్యతిరేకిస్తున్న అన్నయ్య…

0
25

2014 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల సమయంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి జై సమైఖ్యాంద్ర పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ తరపున కలికిరి నియోజకవర్గం నుండి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి కూడ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపిలో చేరుతారని తొలుత ప్రచారం సాగింది. మరోవైపు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం కూడ ఇటీవల కాలంలో మొదలైంది. కానీ, ఈ విషయమై కిరణ్‌కుమార్‌రెడ్డి నుండి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాలేదు. ఇదే సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి టిడిపిలో చేరనున్నట్టు కొంతకాలంగా ప్రచారం సాగుతుండడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టిడిపిలో చేరికకు రంగం సిద్దం
చిత్తూరు జిల్లాలో రాజకీయంగా పేరొందిన కుటుంబాల్లో నల్లారి కుటుంబం ఒకటి. తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ జిల్లా, రాష్ట్రస్థాయిలో రాజకీయ చక్రాన్ని తిప్పిన నేపథ్యం ఈ కుటుంబానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతల ద్వారా కిశోర్‌కుమార్‌రెడ్డి, మంత్రి నారా లోకేశ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి బాధ్యతల అప్పగింత
చిత్తూరు జిల్లాలో టిడిపిని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని టిడిపిలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడ సానుకూలంగా ఉన్నారని సమాచారం. జిల్లాలో నల్లారి వారు బలమైన సామాజిక వర్గం కలిగిఉన్నందున టీడీపీని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా కిశోర్‌ కుమార్‌రెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు లోకేశ్‌ అంగీకరించినట్టు సమాచారం. ఇందులో భాగంగా జిల్లా మంత్రి అమరనాథరెడ్డికి ఈ బాధ్యత అప్పగించినట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here