బిగ్‌బాస్‌ – ఎన్టీఆర్‌లో ఎన్ని రంగులో.!

0
38

అసలు ఇలాంటి కాన్సెప్ట్‌ తెలుగులో వర్కవుట్‌ అవుతుందా.? హోస్ట్‌గా ఎన్టీఆర్‌ ఓకే, హౌస్‌మేట్స్‌ వారంలో ఐదు రోజులపాటు షోని ఎలా రక్తికట్టించగలరు.? ఇలా సవాలక్ష అనుమానాలు తెరపైకొచ్చాయి ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షో ప్రారంభానికి ముందు. షో ప్రారంభమయ్యింది.. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగోరోజు, ఐదో రోజు.. ఇలా ఐదు రోజులు గడిచేసరికి, ఇదొక ఫ్లాప్‌ షో అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. వీకెండ్‌లో మాత్రం ఎన్టీఆర్‌ దుమ్మురేపేశాడు. ఐదు రోజుల డల్‌నెస్‌ని, రెండ్రోజుల్లో పోగొట్టేశాడు. మళ్ళీ సోమవారం వచ్చేసరికి సీన్‌ యధాతథంగా డల్‌ అయిపోయింది. శని, ఆదివారాల్లో షరామామూలుగానే కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత వీకెండ్స్‌తోపాటు, మిగతా రోజుల్లోనూ షో బుల్లితెర వీక్షకుల్ని అలరించడం షురూ చేసింది. ఈ మొత్తం సందడికి ఒకే ఒక్క కారణం షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్‌.వెండితెరపై ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని చాలా సినిమాల్లో చూసేశాం. అక్కడేముంది కిక్కు.. అసలైన కిక్‌, బుల్లితెర మీదనే వుందన్నట్టు.. వారాంతాల్లో ఎన్టీఆర్‌ చెలరేగిపోతున్న వైనం చూస్తే హోస్ట్‌గా ఎన్టీఆర్‌కి ఏ స్థాయిలో రెమ్యునరేషన్‌ ఇచ్చినా తక్కువేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎలిమినేషన్స్‌ సందర్భంగా సస్పెన్స్‌ని ఎన్టీఆర్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్న తీరు, తన కన్నా వయసులో పెద్దవారైన కంటెస్టెంట్లు షో నుంచి ‘ఔట్‌’ అయిపోతున్న టైమ్‌లో వారితో ముచ్చటిస్తున్న తీరు, జీవితం విలువ గురించి ఎన్టీఆర్‌ చెప్పే మాటలు.. ఇలా ఒకటేంటి.? షో మొత్తాన్నీ, ఎన్టీఆర్‌ తన భుజానికెత్తుకున్నట్లే కన్పిస్తోంది. ఐదు రోజులపాటు ఎన్టీఆర్‌ కన్పించడు.. ఆన్న ఆలోచనే వుండట్లేదు ఇప్పుడు బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌కి.
హౌస్‌మేట్స్‌కి రెండ్రోజులపాటు ఎన్టీఆర్‌ ఇచ్చే కిక్‌, ఆ హౌస్‌మేట్స్‌లో మిగతా ఐదు రోజులూ కన్పిస్తోంటే, అలా హౌస్‌మేట్స్‌లో వచ్చే జోష్‌లో ఎన్టీఆర్‌ కన్పిస్తున్నాడు బుల్లితెర వీక్షకులకి. ఎన్టీఆర్‌ చేసే అల్లరి, ఎన్టీఆర్‌కి జీవితం పట్ల వున్న అవగాహన.. ఇవన్నీ చూస్తే, ఎన్టీఆర్‌లో ఇన్ని రంగులున్నాయా.? అని అన్పించకమానదు.
అన్నట్టు, నిన్న, మొన్న (ఆది, శనివారాల్లో) ఎన్టీఆర్‌, బిగ్‌బాస్‌ షోకి షరామామూలుగానే సూపర్‌ కిక్‌ ఇచ్చాడు. ‘లై డిటెక్టర్‌’ పరీక్ష పేరుతో ప్రిన్స్‌ని ఆటపట్టించిన తీరు, ఈ క్రమంలో ఎన్టీఆర్‌ ‘నేనూ ఆ పరీక్ష చేయించుకుంటా..’ అంటూ అల్లరి చేసిన తీరు.. వారెవ్వా ఎన్టీఆర్‌ అన్పించకమానవు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here