విద్యార్థిని స్కూల్‌ యూనిఫామ్‌ వేసుకురాలేదని…

0
29

హైదరాబాద్‌ : నగరంలోని బీహెచ్‌ఈఎల్‌ రావూస్‌ ఉన్నత పాఠశాలలో దారుణ సంఘటన వెలుగు చూసింది. స్కూల్‌ యూనిఫామ్‌ వేసుకొని రాలేదనే కారణంగా పాఠశాల టీచర్‌ ఓ పదకొండేళ్ల విద్యార్థినిని అబ్బాయిల మూత్రశాలలో నిలబెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇంటికి వచ్చి తాను పాఠశాలకు వెళ్లనని తల్లిదండ్రులతో మొర పెట్టుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రావూస్‌ హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న బాలిక శనివారం స్కూల్‌ యూనిఫామ్‌ వేసుకురాలేదనే కారణంగా ఆమెను బాలుర మూత్రశాలలో నిలబెట్టారు.
ఇది గమనించిన తోటి విద్యార్థులు నవ్వుతూ ఎగతాళి చేయడంతో మానసిక ఆవేదనకు గురైన చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ విషయం గురించి ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన తల్లిదండ్రులకు నిర్లక్ష్య సమాధానం ఎదురైంది. విషయం తెలుసుకున్న చైల్డ్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌ పాఠశాలపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు స్కూల్‌ ముందు ఆందోళనకు దిగారు. దీంతో దిగొచ్చిన యాజమాన్యం టీచర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది.
కాగా, స్కూల్‌ నిర్వాకంపై తెలంగాణ మంత్రి కే తారక రామారావు సీరియస్‌ అయ్యారు. విద్యార్థినిని అబ్బాయిల టాయిలెట్‌లో నిలబెట్టడం అమానవీయమని ట్వీట్‌ చేశారు. స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కోరతానని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here