పుస్తక రూపంలో సర్జికల్స్ స్ట్రైక్స్‌ వివరాలు…

0
347

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ పి.వొ.కె లోని ఉగ్రస్థావరాలపై గతేడాది సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన ఘటన పై ఈ దాడికి నేతృత్వం వహించిన మేజర్‌ ఓ పుస్తకం లో తన అనుభవాలను పంచుకోనున్నారు. ఇందులో సర్జికల్స్ స్ట్రైక్స్‌ ఎలా జరిగాయని దానికి ముందు ఎలాంటి వ్యూహ రచన చేశారన్నది వివరించనున్నారు. దాడి చేయడం కన్నా తిరిగి వెనక్కు రావడమే సవాలుగా మారిందని ఆయన చెప్పారు. సర్జికల్స్ స్ట్రైక్స్‌ అనంతరం తిరిగి వస్తుండగా పాక్‌ బలగాల కాల్పుల్లో బుల్లెట్లు తమ చెవుల పక్కనుంచి దూసుకెళ్లాయని వెల్లడించారు. పి.వొ. కె లో భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి ఏడాది పూర్తికానున్న సందర్భంగా ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌– ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడ్రన్‌ మిలిటరీ హీరోస్‌’ పేరిట వెలువడనున్న పుస్తకంలో మేజర్‌ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ పుస్తకాన్ని శివ్‌ అరూర్, రాహుల్‌ సింగ్‌లు రాయగా, పెంగ్విన్‌ ఇండియా సంస్థ ప్రచురిస్తోంది. దీంట్లో భారత సైనికులు ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలకు సంబంధించి 14 నిజజీవిత ఘటనలను పొందుపరి చారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ కు నేతృత్వం వహించిన మేజర్‌ ఈ పుస్తకంలో తనను తాను మైక్‌ టాంగోగా పరిచయం చేసుకున్నారు.
ఉడి ఉగ్రదాడిలో సహచరుల్ని కోల్పోయిన రెండు యూనిట్ల నుంచి మెరికల్లాంటి కమాండోలను ఈ ఆపరేషన్‌కు ఎంపిక చేసుకున్నట్లు టాంగో తెలిపారు. ఘాతక్‌ ప్లటూన్లుగా పిలిచే వీళ్లను పి.వొ.కె లోని భౌగోళిక పరిస్థితులపై అవగాహన కల్పించడానికి సరిహద్దుకు తరలించినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో దాడి చేయాల్సిన లక్ష్యాలను అతికొద్ది మంది అధికారులకు మాత్రమే తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌..రా ఉన్నతాధికారులతో కలిసి రూపొందించిన లక్ష్యాల వివరాలను ప్రభుత్వానికి తెలిపినట్లు పుస్తకంలో వివరించారు.
ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించాలని ఆదేశాలు అందడంతో దాదాపు 19 మంది కమాండోలను వ్యక్తిగతంగా ఎంపిక చేసినట్లు మేజర్‌ టాంగో తెలిపారు. దాడి చేయడం కంటే సురక్షితంగా వెనక్కిరావడమే అప్పుడు తమ ముందున్న పెద్ద సవాలన్నారు. పి.వొ. కె లో పాక్‌ సైన్యం, ఐ.ఎస్‌.ఐ రక్షణ కల్పిస్తున్న నాలుగు ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు చెప్పారు. పి.వొ.కె లోని ఇద్దరు పౌరులతో పాటు జైషే మహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత నిఘా వర్గాలు కొన్నేళ్ల కిత్రమే ఇన్‌ఫార్మర్లుగా మార్చుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఘాతక్‌ ప్లటూన్లు ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డట్లు పేర్కొన్నారు.ఘాతక్‌ ప్లటూన్లు జరిపిన దాడిలో 38 నుంచి 40 మంది ఉగ్రవాదులు, ఇద్దరు పాక్‌ ఆర్మీ అధికారులు చనిపోయినట్లు టాంగో తెలిపారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here