విధ్వంసం సృష్టించిన ఇర్మా తుపాన్‌

0
177

 

ఆర్లండో (ఫ్లోరిడా): అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రం ఫ్లోరిడాకు తుపానుల తాకిడి కొత్త కానప్పటికీ తాజాగా కుదిపేసిన ఇర్మా తుపాను కొంత విభిన్నమైనదని పరిశీలకులు చెబుతున్నారు. తుపాను తాకిడి సంభవించినపుడు కిటికీలు కొట్టుకోవటం, తాగునీరు, ఇంథన కొనుగోళ్ల కోసం బారులు తీరిన ప్రజలు, ఇంకా తీవ్రమైతే ప్రభుత్వం ఏర్పరిచే సహాయ కేంద్రాల్లో తలదాచుకోవడం వంటివి మనకు సాధారణంగా కన్పించే దృశ్యాలు. కానీ ఫ్లోరిడా తీరాన్ని రెండు సార్లు తాకి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన ఇర్మా తుపాను ధాటికి రాష్ట్రంలో ఏ ప్రాంతమూ తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది.
కేవలం ఫ్లోరిడా లోని కీస్‌ వంటి చిన్న దీవుల్లో మాత్రమే కాదు. పొరుగునే వున్న మియామీలో సైతం ఇర్మా పెను గాలులు ధాటికి ఆకాశ హర్మ్యాలు నిలువెల్లా వణికాయి. పెను గాలుల తాకిడికి రెండు భారీ కన్‌స్ట్రక్షన్‌ క్రేన్‌లు నేలకొరిగిపోవటం తుపాను తీవ్రతకు అద్దం పడుతోంది. పర్యాటక ప్రాంతాలైన ఆర్లండో, తంపా వంటి ప్రాంతాలకు ఆకర్షణీయంగా నిలుస్తున్న థీమ్‌ పార్క్‌ల జాడ కూడా కన్పించకుండా పోయింది. ఫ్లోరిడా ఉత్తర ప్రాంతాన వున్న రాజధాని తలాహసీ వంటి నగరాలు మాత్రమే కాదు, ఫ్లోరిడా-జార్జియా బెల్ట్‌లో వున్న అనేక చిన్న పట్టణాలకు కూడా ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇర్మా తుపాను నుండి తప్పించుకునేందుకు ఫ్లోరిడన్స్‌ రాష్ట్రం నలు మూలలకు పరుగులు తీశారు. హైస్కూళ్లలో మంచాలపైన, రోడ్‌సైడ్‌ మోటెల్స్‌లో ఇరుకు బెడ్‌లపైన, ఎక్కడ వీలైతే అక్కడ తలదాచుకోటానికి ప్రయత్నించారు. తుపానును తప్పించుకునేందుకు బయటకు వెళ్లాలా? వద్దా? వెళ్తే ఎక్కడికి వెళ్లాలి? అన్న ప్రశ్నలు చాలా మందికి సమాధానాలు దొరకనివిగా మిగిలిపోయాయి.


నష్టం అంచనాలు కష్టసాధ్యం
ఇర్మా తుపాను బీభత్సం మిగిల్చిన విధ్వంసం తాలూకు అంచనాలు ఇప్పుడే రూపొందించటం కష్ట సాధ్యమని ఫ్లోరిడా విపత్తు నిర్వహణా వ్యవస్థ డైరెక్టర్‌ బ్య్రాన్‌ కూన్‌ స్పష్టం చేశారు. గాలింపు, సహాయక చర్యలు సోమవారం ఉదయం నుండి ప్రారంభిస్తామన్నారు. తొలుత కరీబియన్‌ ప్రాంత దీవులను, దేశాలను చుట్టుముట్టిన ఇర్మా తుపాను అక్కడ 28మందికి పైగా బలి తీసుకుంది. దీనిని ‘అత్యంత భారీ విపత్తు’గా ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్లోరిడాకు అత్యవసర ఆర్థిక సాయాన్ని తక్షణం అందచేయాలని ఆదేశాలు జారీ చేశారు. 1921 తరువాత ఇంత భారీ స్థాయిలో ఈ ప్రాంతాన్ని తాకిన తుపాను ఇర్మాయేనని అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఉత్తర ఫ్లోరిడా, దక్షిణ జార్జియా వైపు కదులుతున్న ఇర్మా తుపాను సోమవారం నాడు మరింత బలహీన పడుతుందని అంచనా వేసినప్పటికీ అది ఏ మాత్రం తగ్గని తన తీవ్రతతో ఫ్లోరిడా పశ్చిమ ప్రాంతం దిశగా పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
విలవిలలాడిన ఫ్లోరిడా
ఇర్మా సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలిస్తే ఇది ఫ్లోరిడా దక్షిణ ప్రాంతాన్ని తీవ్రంగానే దెబ్బతీసిందని చెప్పవచ్చు. గతంలో సంభవించిన ఆండ్రూ, తాజాగా ఇటీవలి హార్వీ హరికేన్‌ల బీభత్సాలను మరువక ముందే ఇర్మా తుపాను భారీ యెత్తున విరుచుకుపడింది. దీనితో కకావికలమైన ప్రజలు ఉత్తర, పశ్చిమ దిక్కులకు పరుగులు తీశారు. అయితే శనివారం నాడు తుపాను తన దిశను పశ్చిమ దిక్కుకు మార్చుకోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తీర ప్రాంత నగరాలైన నేపుల్స్‌, ఫోర్ట్‌ మేయర్స్‌, తంపా వంటి ప్రాంతాలు తుపాను తాకిడికి నిలువెల్లా వణికాయి. గతంలో తుపాన్ల తాకిడికి తట్టుకునే సురక్షిత ప్రాంతం అన్న పేరున్న ఈ ప్రాంతం ఇప్పుడు నేలమట్టమై పోయింది. ఇర్మా తుపాను గాలుల ధాటికి విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలిపోవటంతో ఆదివారం ఉదయానికి లక్షలాది ఫ్లోరిడన్స్‌ కారు చీకట్లో మిగిలారు. అంతకు ముందు మియామీని ముంచెత్తిన ఇర్మా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో 35 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మియామీ నగరంలో దాదాపు సగం ప్రాంతాలు నీట మునిగిపోయాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here