పెళ్లి కార్డులు పంచి వెళ్తూ: ఇస్రో సీనియర్ ఇంజినీర్ మృతి

0
38

అనంతపురం: తన పెళ్లి కార్డులు పంచి, వెళ్తున్న ఇస్రో సీనియర్‌ ఇంజనీర్‌ ప్రేమ్‌ నజీర్‌బాబా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కదిరి మండలంలోని ముత్యాల చెరువు గ్రామ సమీపాన సోమవారం కర్ణాటక ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన సిమెంటు లారీ ఢీ కొనడంతో నెల్లూరు జిల్లా ఇస్రోలో సీనియర్‌ ఇంజనీరుగా పనిచేసే ప్రేమ్‌ నజీర్‌బాబా చనిపోయారు.

కడప జిల్లా చిలంకూరుకు చెందిన ఈయన వివాహాన్ని ఈ నెల 17న నిశ్చయించారు. బంధుమిత్రులను ఆహ్వానించేందుకు ఆదివారం రాత్రి కదిరికి వచ్చారు. శుభలేఖలు పంచి, సోమవారం ఉదయం బెంగుళూరుకు కేఎస్‌ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. బస్సు కదిరి దాటి ముత్యాల చెరువు వద్దకు వెళ్లగానే బెంగుళూరు నుంచి వస్తున్న సిమెంటు లారీ వేగంగా వచ్చి బస్సు చివరి భాగాన్ని ఢీకొంది. ప్రమాదంలో ప్రేమ్‌ బాబా తలకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ప్రమాదంపై ఆరా తీశారు. ప్రేమ్‌ నజీర్‌ బాబా మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్‌ చేసి, మోటారు వాహనాల తనిఖీ కార్యాలయానికి అప్పగించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, దర్యాఫ్తు చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here