రజనీతో కలిసి రాజకీయాల్లో పని చేస్తా: కమల్‌

0
1137
చెన్నై: కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ఆరంగ్రేటంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అభిమానులను గందరగోళానికి గురి చేస్తుంటే.. మరో సీనియర్‌ నటుడు కమల్‌ హాసన్‌ మాత్రం తాను రాజకీయాల్లో రావటం ఖాయమనే సంకేతాలను ఇప్పటికే అందించారు. ఈ నేపథ్యంలో గత సాయంత్రం ఓ తమిళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలనే వెల్లడించారు.
‘త్వరలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నా. రజనీ రాజకీయాల్లోకి వస్తే చాలా సంతోషం. సినిమాల పరంగానే మా ఇద్దరి మధ్య పోటీ ఉంది. కీలక సమస్యలపై గతంలో మేం చర్చించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆయన మా పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తా. రజనీతో కలిసే పార్టీని ముందుకు తీసుకెళ్తా’ అని కమల్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
వచ్చే నెలలో తాను హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్‌ షో పూర్తయిపోయిన వెంటనే రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానని కమల్‌ ఇది వరకే చెప్పిన విషయం తెలిసిందే. 62 ఏళ్ల ఈ సీనియర్‌ నటుడు మొదటి నుంచి సామాజిక అంశాలతోపాటు తమిళ రాజకీయాలపై కూడా స్పందిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీ, ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో డీఎంకేతో సానిహిత్యంగా కనిపిస్తూనే.. మరోవైపు తన రంగు కాషాయం కాదంటూ బీజేపీపై కమల్‌ పరోక్షంగా సెటైర్లు వేశారు కూడా.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here