బోర్డింగ్‌ పాస్‌కు బై..బై..!

0
998

న్యూఢిల్లీ:  విమానాశ్రయాల్లో బోర్డింగ్‌ పాస్‌ విధానానికి స్వస్తి పలకాలని విమానయాన భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి. బోర్డింగ్‌ పాస్‌ల స్థానంలో బయోమెట్రిక్‌తో కూడిన ఎక్స్‌ప్రెస్‌ చెక్‌–ఇన్‌ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. దీని వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని, వారి ప్రయాణం సాఫీగా సాగుతుందని చెపుతున్నాయి. ఇటీవలే దేశంలోని 17 ఎయిర్‌పోర్ట్‌ల్లో హ్యాండ్‌బ్యాగేజ్‌ ట్యాగ్‌ల విధానానికి విమానయాన భద్రతా ఏజెన్సీలు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే.

దేశంలోని 59 విమానాశ్రయాల్లో బోర్డింగ్‌ కార్డు రహిత విధానాన్ని అమలులోకి తేవాలని యోచిస్తున్నామని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నామని, ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని విమానయాన భద్రతా ఏజెన్సీ అయిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఓపీ సింగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం తాము రెండు ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నామని, ఇందులో మొదటిది విమానాశ్ర యాల్లో ఇంటిగ్రేటెడ్‌ సెక్యూరిటీ సొల్యూషన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టడమని, ప్రస్తుతం ఉన్న భద్రతా సంస్థలన్నింటినీ అనుసంధానించడం.. బయోమెట్రిక్, వీడియో ఎనలిస్టిస్‌ సిస్టమ్‌ మొదలైనవి వినియోగించడం ఇందులో భాగమన్నారు.

బోర్డింగ్‌ పాస్‌ విధానానికి స్వస్తి పలకడం దీనిలో భాగమేనని, ఇటీవలే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభించామని, ప్రస్తుతం అక్కడ ప్రయాణికులకు ఎక్స్‌ప్రెస్‌ చెక్‌–ఇన్‌ విధానం అందుబాటులోకి వచ్చిం దని తెలిపారు. బోర్డింగ్‌ పాస్‌ విధానానికి స్వస్తిపలకడం అనేది టెక్నాలజీ బేస్డ్‌ సెక్యూరిటీ సిస్టమ్స్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో హైదరాబాద్‌ విమానాశ్రయం ఒక్కటే పూర్తిగా బయోమెట్రిక్‌ విధానాన్ని కలిగి ఉందని, దేశంలోని మిగిలిన ఎయిర్‌పోర్టుల్లోనూ దీనిని అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మానవ వనరులను హేతుబద్ధీకరించడం తమ రెండో ప్రాజెక్టు అని సింగ్‌ చెప్పారు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీలోనే కాక ఎయిరోస్పేస్‌ స్టేషన్లు, న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్లు మొదలైన వాటిలో దీనిని అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన విధానం ప్రకారం.. దేశీయ విమానయాన ప్రయాణికులు టెర్మినల్‌ బిల్డింగ్‌కు వెలుపల ఉండే సెల్ఫ్‌ సర్వీస్‌ కియోస్క్‌ల నుంచి బోర్డింగ్‌ పాస్‌ ప్రింటవుట్‌ను తీసుకుంటారు. ఆ తర్వాత చెక్‌ ఇన్‌ ఏరియాలోకి వెళ్లకుండా నేరుగా ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెక్‌ లేన్‌లోకి చేరుకోవచ్చు. అక్కడి నుంచి బోర్డింగ్‌ ఏరియాకు వెళతారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here