భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా ప్రభుత్వం

0
1273
వాషింగ్టన్:అయిదు నెలల క్రితం నిలిపివేసిన ‘హెచ్-1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్’ స్కీమ్‌ను అమెరికా ప్రభుత్వం పునరుద్ధరించింది. లెక్కకు మించి వీసాలు రావడం, హెచ్-1బీ వీసాల జారీ విధానంలో మార్పులు చేయాలన్న తలంపుతో అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ‘హెచ్-1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్’ను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ విధానాన్ని ఉపయోగించుకుని విదేశాల్లోని ఐటీ కంపెనీలు.. అమెరికాలోని తమ శాఖల్లో పనిచేసేందుకు ఏదైనా ఉద్యోగికి హెచ్-1బీ వీసాను వచ్చేలా చేయవచ్చు.
కాకపోతే దీనికి 1225 డాలర్లు (దాదాపు 79వేల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి వీసా ప్రక్రియ పదిహేను రోజుల్లోగా పూర్తి కాకుండా చెల్లించిన ఫీజును పూర్తిగా తిరిగి ఇచ్చేస్తారు. అంతేకాకుండా అభ్యర్థి దరఖాస్తును సాధారణ ప్రక్రియ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఈ విధానం వల్ల ఐటీ కంపెనీలు కొన్ని అవకతవకలకు పాల్పడుతున్నాయన్న కారణంతో అమెరికా ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఏప్రిల్ నెలలో ‘హెచ్-1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్’కు తాత్కాలిక బ్రేక్ వేసింది. తాజాగా ఈ వీసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు.. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం ప్రారంభిస్తున్నట్లు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ తెలిపింది.
ప్రస్తుతం ఈ విధానం ద్వారా 65వేల హెచ్-1బీ వీసాలను ఇస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తున్నామనీ, కొత్త దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటామన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వీరితోపాటు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీయులకు కూడా 20వేల వరకు హెచ్-1బీ వీసాలను జారీ చేస్తామన్నారు.   ప్రీమియం ప్రాసెసింగ్ విధానాన్ని భారతీయ ఐటీ కంపెనీలు విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ విధానం ద్వారా భారీ సంఖ్యలో అమెరికాకు వెళ్తున్న ఐటీ ఉద్యోగుల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here