స్వాతంత్య్ర సమరయోధుడు సీవీ చారి ఇక లేరు

0
944
హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, ఆలిండియా హిందీ నాగరిక లిపి అధ్యక్షుడు సీవీ చారి(86) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం విజయనగర్‌ కాలనీలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో చారికి అంత్యక్రియలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, సామాజికవేత్తలు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. చారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించిన సీవీ చారి నల్లగొండ జిల్లా దేవరకొండ మునుగోడు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 15 ఏళ్ల ప్రాయంలోనే భూదానయజ్ఞ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. వినోబాభావేతో కలసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తన భూములను పేదలకు పంచిపెట్టారు. నల్లగొండలో ప్రారంభమైన చారి ప్రస్థానం హైదరాబాద్‌ నగరంతో పెనవేసుకుంది. ఎలాంటి ఆర్భాటాలకూ తావు లేకుండా, రాజకీయ పదవులను ఆశించకుండా తన జీవితమంతా సామాజిక సేవకే అంకితం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ట్రస్టుతో ఆయనకు 30 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. సుదీర్ఘకాలం పాటు భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. గాంధీ ప్రతిష్టాన్, గాంధీ స్మారక నిధికి చైర్మన్‌గా వ్యవహరించారు. వినోబాభావే, జయప్రకాష్‌నారాయణ్, నిర్మలాదేశ్‌పాండే, రామానందతీర్థ, ఇందిరాగాంధీ, పివీ నరసింహారావు, ప్రభాకర్‌జీ, మొరార్జీదేశాయ్‌ వంటి ప్రముఖుల తో కలసి నడిచారు.

ప్రముఖుల నివాళి…  
అంతకుముందు సీవీ చారి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం నాంపల్లిలోని గాంధీభవన్‌ ట్రస్టు కార్యాలయంలో ఉంచారు. వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరై సీవీ చారి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, గాంధీభవన్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జి.నారాయణరావు, అంత్యోదయ మండలి కార్యదర్శి సుబ్రహ్మణ్యం, హిందీ మహావిద్యాలయ చైర్మన్‌ సురేంద్ర లూనియా, ఎమ్మెల్సీ భాను, కాంగ్రెస్‌ నేత నిరంజన్, భూదానయజ్ఞ బోర్డు మాజీ చైర్మన్‌ సర్వర్షిణి రాజేందర్‌రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం, బీజేపీ, టీడీపీలకు చెందిన నాయకులు నివాళులర్పించారు. తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, తెలంగాణ, ఏపీ పీసీసీల అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు మల్లు భట్టివిక్రమార్క తదితరులు చారి మృతిపట్ల తమ సంతాపాన్ని ప్రకటించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here