వాడవాడలా బతుకమ్మ వేడుకలు

0
1374

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఘనంగా ఆరంభమయ్యాయి. మంత్రుల సతీమణులు మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. వాడవాడలా ఆటపాటలతో వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో తొలిరోజు పండగను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. ఎంగిలిపూల బతుకమ్మల సందడి ఉదయం నుంచి ప్రారంభమైంది. తీరొక్క పూలను సేకరించి తెచ్చి మహిళలు గౌరమ్మను పూజించి బతుకమ్మలను పేర్చారు. అనంతరం వారు నింగీనేలా ఏకమయ్యేలా ఆడిపాడారు. హైదరాబాద్‌లోని మంత్రుల ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో మంత్రుల సతీమణులు, కుటుంబీకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తమ నివాసంలో బతుకమ్మను ఆడారు. తెలంగాణలో గతంలో కంటే ఉత్సాహంగా బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రుల సతీమణులు సి.శ్వేతా లక్ష్మారెడ్డి, ఈటల జమునా రాజేందర్‌, శ్రీనిత హరీశ్‌రావు, పోచారం పుష్పా శ్రీనివాస్‌రెడ్డి, ఈటల కూతురు నీత, కోడలు క్షమిత, కరీంనగర్‌ జడ్పీ ఛైర్మన్‌ తుల ఉమ, మహిళా సహకారసంస్థ ఛైర్మన్‌ గుండు సుధారాణి, హైదరాబాద్‌ మేయర్‌ సతీమణి శ్రీదేవి రామ్మోహన్‌ తదితరులు మంత్రుల ప్రాంగణంలో బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో మంత్రుల నివాస ప్రాంగణం మార్మోగింది. దాదాపు అయిదు గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం బతుకమ్మలను వారు నిమజ్జనం చేశారు. యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా తమ కార్యాలయంలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ పండుగ మహిళలను గౌరవిస్తుందని, ప్రకృతిని ఆరాధించాలని ఉద్బోధిస్తుందని తెలిపారు. హన్మకొండలోని పురాతన వేయిస్తంభాల ఆలయ పరిసరాలు పూలసంద్రంగా మారాయి. వేలాదిమంది వనితలు ముచ్చటగా బతుకమ్మలను ముస్తాబుచేసి తీసుకొచ్చి సామూహికంగా సంబురాలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here