ప్రపంచ బ్యాంకులో భారత్ లాబీయింగ్: పాక్ మీడియా కథనాలు

0
224

సింధూ నదిపై భారత్ నిర్మించిన కిషన్‌గంగా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రపంచ బ్యాంకుకు పాకిస్థాన్ చాలాసార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గత శనివారం ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో మరోసారి పాక్ ఫిర్యాదు చేసినా అంతగా స్పందించలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన పాక్ మీడియా వరల్డ్ బ్యాంకుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ బ్యాంకు దక్షిణాసియా విభాగంలో భారత్ లాబీయింగ్‌కు పాల్పడిందని ఆరోపించింది. 1967 నాటి సింధూ నది జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి కిషన్‌గంగా జలవిద్యుత్ కేంద్రాన్ని భారత్ నిర్మిస్తోందని పాక్ పదేపదే ఆరోపిస్తున్నా ప్రపంచ బ్యాంకు స్పందించకపోవడానికి కారణం ఇదేనంటూ పాకిస్థాన్ పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ ఓ కథనం వెలువరించింది.

ఇదే అంశంపై పాక్ ప్రతినిధులు వరల్డ్ బ్యాంకుతో రెండు రోజులపాటు చర్చించారు. ఈ చర్చల అనంతరం బుధవారం ప్రపంచ బ్యాంకు ఓ ప్రకటన చేసింది. భారత్‌, పాక్ జలవివాదంపై సమీక్షించే అధికారం తమకులేదని, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అనేక విధానపరమైన సంస్థలు ఉన్నాయని తెలిపింది. సింధూ నది జలాల ఒప్పందం భారత్- పాక్‌ల మధ్య నీటి వివాదాలను పరిష్కరించడంలో పరిమితి పాత్ర పోషిస్తుందని స్పష్టం చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పాక్ మీడియా, ప్రపంచ బ్యాంకును భారత్ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వ్యాఖ్యానించింది. అంతేకాదు, గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో పెరుగుతున్న భారతీయ ప్రభావంపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలని సూచించింది. కిషన్‌గంగా జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రపంచ బ్యాంకు సహకారంతో భారత్ నిర్మిస్తోంది.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here