జూన్ మొదటి వారంలో నే నైరుతి రుతుపవనాల రాక

0
542

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు చల్లని కబురందించాయి. శుక్రవారం ఇవి దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. మరో 24 గంటల్లో ఇవి మరింత బలపడి దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్, మాల్దీవుల్లోకి విస్తరించనున్నాయి. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ప్రస్తుతం అండమాన్‌ పరిసరాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం, నైరుతి బంగాళాఖాతంలో మరొకటి, బిహార్‌ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో ఈ నెల 28 నాటికల్లా తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో వెల్లడించింది.

ఈ నెల 28న ఏర్పడే అల్పపీడనం ప్రభావం వల్ల దక్షిణ గాలులు తగ్గి ఉష్ణ తీవ్రత పెరగనుందని, అదే సమయంలో ఉక్కపోత కూడా అధికమవుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి ఆర్‌.మురళీకృష్ణ శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. కాగా శనివారం రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు ఆస్కారముందని ఐఎండీ వెల్లడించింది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెంటచింతలలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here