అమెరికాలో భయానక వరదలు

0
290

మేరీలాండ్: అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం ఎల్లికాట్ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. హోవార్డ్ కౌంటీ ప్రాంతంలోని ఇండ్లలోకి ఆదివారం భారీగా వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో హోవార్డ్ కౌంటీ పరిధిలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు మేరీలాండ్ గవర్నర్ లార్రీ హోగన్ సోమవారం ప్రకటించారు. ఎల్లికాట్ ప్రాంతానికి సమీపంలోని పాటాప్సో నది నుంచి రికార్డు స్థాయిలో నీటిని వదలడంతో కొన్ని ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు వరద ప్రవహిస్తున్నది. ఆదివారం మధ్యాహ్నం 24.13 అడుగుల ఎత్తున ప్రవహించిన నదీ ప్రవాహం ప్రస్తుతం 23.6 అడుగుల వద్ద స్థిరపడింది. కాగా వరదల్లో ఒక వ్యక్తి గల్లంతయ్యారని హోవార్డ్ కౌంటీ అధికారి అల్లన్ కైటిల్మెన్ తెలిపారు. ఇప్పటివరకు మృతులెంత మంది ఉంటారన్న సంగతి తేలలేదు. 2016లో కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో వరద నీరు ప్రవహిస్తున్నదని అధికారులు తెలిపారు. గడిచిన 24గంటల్లో గ్రేటర్ బాల్టిమోర్ ప్రాంతంలో వర్షపాతం 3-6 అంగుళాలు, కొన్ని ప్రాంతాల్లో 9అంగుళాలు నమోదైందని జాతీయ వాతావరణ శాఖ (ఎన్‌డబ్ల్యూఎస్) తెలిపింది. అన్నె అరుండెల్ కౌంటీ, ఆగ్నేయ హోవార్డ్ కౌంటీల పరిధిలో తాజాగా వరదలు పోటెత్తే అవకాశం ఉన్నదని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజల కోసం సహాయ, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్వాసితులు తల దాచుకునేందుకు రోజర్ కార్టర్ కమ్యూనిటీ సెంటర్‌ను తెరిచి ఉంచారు. స్థానికులను ఇండ్లను ఖాళీ చేసి, సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని అధికారులు కోరారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here