కేరళ ను తాకనున్న రుతుపవనాలు

0
289

న్యూఢిల్లీ, మే 28: దేశంలో వర్షాకాల ఆగమనాన్ని నిర్దేశించే నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళ తీరాన్ని తాకాయని ప్రైవేట్ వాతావరణ పరిశోధనాసంస్థ స్కైమెట్ ప్రకటించింది. అయితే భారత వాతావరణశాఖ (ఐఎండీ) మాత్రం దీంతో ఏకీభవించలేదు. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవుల్ని దాటాయని, మరో 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకవచ్చునని వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఉదయం 8.15గంటల బులెటిన్‌ను ఐఎండీ విడుదల చేసింది. ఏదేమైనా అంచనాలకు భిన్నంగా ఈసారి కాస్త ముందుగానే అండమాన్‌ను రుతుపవనాలు తాకాయి. మే 29 నాటికి నైరుతి రుతుపవనాలు రావడం గడిచిన ఐదేండ్లలో ఇదే తొలిసారి. ఐఎండీ, స్కైమెట్ అంచనాల్లో గంటల తేడా మాత్రమే ఉండడంతో వేసవి తాపానికి ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు చల్లని కబురు అందినట్లే. రుతుపవనాల రాకతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

మే 28 (సోమవారం) నాటికి రుతుపవనాలను పోలిన వాతావరణ స్థితి ప్రస్తుతం కేరళపై నెలకొని ఉంది. కాబట్టి వార్షిక వర్షాకాలం వచ్చేసినట్లుగానే భావించాలి అని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. ఐఎండీ మాత్రం మే 29న (మంగళవారం)
రుతుపవనాలు కేరళ తీరం దాటవచ్చునని పేర్కొన్నది. అరేబియా సముద్రంలో తలెత్తిన సాగర్, మెకును తుఫాన్‌ల వల్ల అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాల రాక కొద్దిగా ఆలస్యమైంది. కాగా మెకును తుఫాను ఓమన్ దిశగా దూరంగా వెళ్లిపోవడంతో నైరుతి రుతుపవనాలు సోమవారం అండమాన్ దీవులతోపాటు అరేబియా సముద్రంలోని ఆగ్నేయ ప్రాంతం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోకి ప్రవేశించాయి అని ఐఎండీ ప్రకటించింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు సానుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణశాఖ ఐఎండీ దీర్ఘశ్రేణి అంచనాల విభాగం డైరెక్టర్ డీఎస్ పాయ్ వెల్లడించారు. కాగా, గత ఐదేండ్లలో మే 29నాటికి రుతుపవనాలు కేరళను తాకడం ఇదే తొలిసారి. గత ఏడాది మే 30న రుతుపవనాలు ప్రవేశించాయి. ఈసారి ఇప్పటివరకు వీటి పయనానికి బంగాళాఖాతంలో గాలులు అనుకూలంగా ఉన్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే తెలుగు రాష్ర్టాలకు జూన్ 7, 8 తేదీల్లో రుతుపవనాలు విస్తరించవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈసారి దేశంలో సగటు లేదా అంతకుమించి వర్షాలు కురిసేందుకు 54 శాతం అవకాశముందని వాతావరణశాఖ గతనెలలోనే ప్రకటించింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here