చెరుకు రైతుకు చేయూత

0
253

 చెరుకు రైతులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.8,500 కోట్ల బెయిల్ ఔట్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చక్కెర కోసం ఒక బఫర్‌స్టాక్‌ను ఏర్పాటు చేయాలని, ఇథనాల్ ఉత్పత్తి సామర్థాన్ని పెంచాలని, చక్కెర మిల్లుల నష్టాలను అరికట్టేందుకు కనిష్ఠ అమ్మకం ధరను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు, 30 లక్షల టన్నులతో బఫర్‌స్టాక్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.4,440 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది.

అలాగే చక్కెర అమ్మకం ధరను కనిష్ఠంగా కిలోకు రూ.29గా నిర్దేశించింది. మిల్లు యజమానులు అంతకన్నా తక్కువకు అమ్మడానికి వీలులేదని తెలిపింది. రైతులకు రూ.22 వేల కోట్లకు పైగా బకాయి పడిన మిల్లు యజమానులకు సహాయపడే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంది. వార్షిక దేశీయ డిమాండ్ 2.5 కోట్ల టన్నులు కాగా సెప్టెంబర్‌తో ముగిసే 2017-18 సీజన్‌లో రికార్డు స్థాయిలో 31.5 మిలియన్ టన్నుల చెరుకు ఉత్పత్తి అయింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం కంటే దిగువకు ధరలు పడిపోవడంతో మిల్లు యజమానులు నష్టాల బారిన పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చక్కెర బెల్ట్‌గా పేర్కొనే కైరానా లోక్‌సభ నియోజకవర్గంలో ఇటీవలి ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన అనంతరం కేంద్రం ఈ బెయిల్ ఔట్ ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. మంత్రివర్గ నిర్ణయాలను ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మీడియాకు వివరిస్తూ, ఏడాదికి 30 లక్షల టన్నుల బఫర్‌స్టాక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనివల్ల కేంద్రంపై రూ.1,175 కోట్ల భారం పడుతుందని చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here