కుప్పకూలిన గౌలిగూడ హ్యాం…!!!

0
229

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/సుల్తాన్‌బజార్: సుమారు 88 ఏండ్లపాటు హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచిన ఓ చారిత్రాత్మక చిహ్నం చెదిరిపోయింది. నగర రవాణా వ్యవస్థకు నిషాన్‌గా నిలిచిన గౌలిగూడ హ్యాంగర్ నేలకు వాలింది. ఓ ఇంజినీరింగ్ అద్భుతం కాలగర్భంలో కలిసిపోయింది. లక్షల మంది ప్రయాణికులకు నీడను ఇచ్చిన సీబీఎస్ హ్యాంగర్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. 1930లో నిజాంనవాబు నిర్మించిన మిసిసిపీ హ్యాంగర్ గురువారం తెల్లవారుజామున కుప్పకూలింది. మూసీనది ఒడ్డున సమున్నతంగా నిలిచిన భారీ రేకులషెడ్డు అవసానదశకు చేరుకుని అవతారం చాలించింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి సీనియర్ ఆర్టీసీ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ కట్టడం కూలడానికి గల కారణాలను ఆయన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కట్టడం కూలిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. స్థలాన్ని ఆర్టీసీ అదనపు ఆదాయం కోసం ఉపయోగించుకుంటామన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌కు నివేదించి ఈ స్థలంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థలాన్ని ఇతర సంస్థలకు అప్పగించబోమని మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ పురాతన కట్టడం కూలినా ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదాన్ని, నష్టాన్ని నివారించగలిగామని మంత్రి చెప్పారు. కూలిన షెడ్డులో దుకాణాలు లీజుకు తీసుకున్నవారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలో దుకాణ నిర్వాహకులతో సమావేశం ఏర్పా టుచేస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఇక్కడి దుకాణదారుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్టీసీ గ్రేటర్ ఈడీ పురుషోత్తంనాయక్, సీఈ సుమిత్రా మేరి, హైదరాబాద్ ఆర్‌ఎం వినోద్‌కుమార్, డీవీఎం మాధవరెడ్డి, ఈఈ విజయ్‌కుమార్, కాచిగూడ డీఎం చందర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు ఎం ఆనంద్‌కుమార్‌గౌడ్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here