మరోసారి కోర్టు మెట్లెక్కనున్న సల్మాన్?

0
245


1998 నుంచి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కోర్టు కష్టాలు తప్పడం లేదు. హిట్ అండ్ రన్ కేసులో చాలా సంవత్సరాల విచారణ అనంతరం ….ఆ కేసు నుంచి సల్మాన్ కు ఊరట లభించింది. అయితే 1998లో జరిగిన కృష్ణ జింకల వేట కేసులో సల్లూ భాయ్ కు జోథ్ పూర్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనేక నాటకీయ పరిణామాల మధ్య సల్లూ భాయ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే సల్మాన్ …మరోసారి కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఓ స్థల వివాదంలో సల్మాన్ పై ఓ ఎన్నారై జంట లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు ఈ విషయాలను వెల్లడించారు.

సల్మాన్ ఖాన్ కు చెందిన అర్పితా ఫామ్స్ కు ఆనుకొని ఓ ఎన్నారై జంటకు కొద్దిగా స్థలం ఉంది. అర్పితా ఫామ్స్ గుండా ఆ స్థలాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.  అందులో వారు కొత్తగా ఇంటిని నిర్మించేందుకుగాను తమ స్థలంలోఎలక్ట్రిక్ పోల్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే తమ స్థలంలో ఆ పోల్ ఏర్పాటును సల్మాన్ అనుచరులు అడ్డుకున్నారని తమ స్థలంలోకి వెళ్లేందుకూ అనుమతించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలను ఆ ఎన్నారై జంట ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ వ్యవహారంలో సల్మాన్ కు లీగల్ నోటీసులు పంపేందుకు కూడా వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సల్మాన్ తరఫు న్యాయవాది వాదన మరోలా ఉంది. సల్మాన్ కు ఈ స్థల వివాదానికి ఏం సంబంధం లేదని సెలబ్రిటీ అయిన సల్మాన్ పై కావాలనే బురద జల్లుతున్నారని అన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here