వింబుల్డన్ క్వార్టర్స్‌కు చేరిక నాదల్, సెరెనా కూడా……???

0
231

లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు రఫెల్ నాదల్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన స్విస్ లెజెండ్ ఫెదరర్ పురుషుల సింగిల్స్ ప్రి-క్వార్టర్ ఫైనల్‌లో 6-0, 7-5, 6-4 తేడాతో అడ్రియాన్ మన్నారినో (ఫ్రాన్స్)ను మట్టికరిపించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్ 16 నిమిషాల్లోనే తొలి సెట్‌ను కైవసం చేసుకోవడం విశేషం. ఇప్పటికే ఎనిమిదిసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన ఫెదరర్ ఈ టోర్నీలో క్వార్టర్స్ చేరడం 16వ సారి కాగా, ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఇది 53వ సారి. 2005లో ఈ టోర్నీ మూడో రౌండ్ నుంచి 2006లో టైటిల్ సాధించే వరకు వింబుల్డన్‌లో వరుసగా 34 సెట్లలో విజయం సాధించిన ఫెదరర్ ప్రస్తుతం ఆ రికార్డుకు మరో రెండు సెట్ల దూరంలో ఉన్నాడు. సెమీస్‌లో స్థానం కోసం ఫెదరర్ 8వ సీడ్ ఆటగాడు కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా)తో తలపడనున్నాడు. స్పెయిన్ బుల్ నాదల్ 6-3, 6-3, 6-4 సెట్ల తేడాతో జిరీ వాసెలీని(చెక్ రిపబ్లిక్) చిత్తుచేసి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు.

సెరెనా విలియమ్స్ జోరు: మహిళల సింగిల్స్‌లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ వరుసగా 18వ మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. వింబుల్డన్ ప్రి క్వార్టర్ ఫైనల్‌లో సెరెనా 6-2, 6-2 తేడాతో యెవ్‌గెనియా రోడినా(రష్యా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.

చెమటోడ్చిన దివిజ్ జోడీ: పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్ శరణ్, ఏ సిటక్(న్యూజిలాండ్) జోడీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రి క్వార్టర్స్‌లో భారత్, న్యూజిలాండ్ ద్వయం 1-6, 6-7, 6-4, 6-4, 6-4 తేడాతో ఎర్లిచ్, మటోవ్‌స్కీ జోడీపై చెమటోడ్చి విజయం సాధించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here