ఎన్టీఆర్ మాటలకు వారం పాటు తినలేదు..

0
230

ఒకప్పుడు కామెడీ హీరోగా వెలుగు వెలిగి నవ్వులు పూయించిన నటకిరీటీ రాజేంద్రప్రసాద్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. చిన్నస్థాయి నటుడిగా మొదలైన ఆయన సినీ ప్రస్థానం స్టార్ హీరోగా ఎదిగే వరకూ సాగింది. తన కామెడీ టైమింగ్ తో డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తండ్రి పాత్రలతో పాటు మరికొన్ని కీలకమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..

‘ఇండస్ట్రీలో నిలబడాలంటే నీకంటూ ప్రత్యేకత ఉండాలి. లేకుంటే రాణించడం కష్టం’ అని అన్నగారు తనతో చెప్పారని.. ఆ మాటల నుంచి స్ఫూర్తి పొంది.. తాను కామెడీ హీరోగా రాణించానని రాజేంద్రప్రసాద్ అన్నారు.  తాను అప్పట్లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ అభినందించారని రాజేంద్రప్రసాద్ గుర్తుచేసుకున్నారు. మొదటిసారి అన్నగారిని కలిసిన తనను ఎంత అప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడని.. బాగా మాట్లాడాడని చెప్పుకొచ్చాడు.

‘ పౌరాణిక వేషాల పేరు చెప్పగానే రామారావు అంటారు.. కుటుంబ కథలు.. సాంఘిక చిత్రాలంటే బ్రదర్ నాగేశ్వరరావు పేరు చెబుతారు.. డిష్యుం.. డిష్యుం ఫైటింగ్ సినిమాలకు కృష్ణ.. రోమాంటిక్ సినిమాలకు శోభన్ బాబు ఉన్నారు. మరి నువ్వు దేనికి పనికివస్తావో చెప్పు.?’ అని అన్నగారు తనను ప్రశ్నించారని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఆ మాట విన్న తర్వాత తనకు వారం రోజుల పాటు అన్నం కూడా తినబుద్ది కాలేదని రాజేంద్రప్రసాద్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.

అన్నగారి మాటలు తనలో కసిని పెంచాయని.. అందుకే తాను కామెడీ ట్రాక్ ను ఎంచుకొని ఈ స్థాయికి ఎదిగానని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. తాను ఇలా కావడానికి ఎన్టీఆర్ కారణమని గుర్తు చేసుకున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here