చదలవాడ కృష్ణమూర్తి జనసేన లో చేరడం తో తిరుపతి లో మొదలైన రాజకీయ రచ్చ. .

0
767
చదలవాడ కృష్ణమూర్తి జనసేన లో చేరడం తో తిరుపతి లో మొదలైన రాజకీయ రచ్చ. .
తిరుపతిలో అప్పుడే రాజకీయం వేడెక్కింది. ఇద్దరు కీలకనేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ పరస్పరం తిట్టేసుకున్నారు. ఇద్దరూ కాపునేతలే. మొన్నటివరకు ఒకే పార్టీలో కలిసి పనిచేశారు. అందులో ఒకరు పార్టీ మారడంతో ప్రత్యర్థులైపోయారు. దీంతో మాటలజోరు పెంచారు. నువ్వెంతంటే నువ్వెంత, నీ లెక్క తేలుస్తానంటే.. నీ సంగతి చూస్తా.. అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? తిరుపతిలో ఏం జరుగుతోంది?
చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో చదలవాడ కృష్ణమూర్తి ఒకరు. మొన్నటివరకు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చదలవాడను టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌ను చేశారు చంద్రబాబు. రెండు పర్యాయాలు ఆయన ఆ పదవిలో ఉన్నారు. జీవితకాలంలో ‍ఒక్కసారైనా పాలకమండలి సభ్యుడినైతే చాలని అందరితో చెప్పుకునేవారు. అలాంటిది ఏకంగా ఛైర్మనే అయ్యారు. తనను ఛైర్మన్ సీట్లో కూర్చోబెట్టిన చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని పలుమార్లు మీడియాముఖంగా కూడా చదలవాడ చెప్పుకున్నారు. అలాంటి చదలవాడ టీడీపీని వదిలి జనసేనలో చేరారు. పార్టీని వీడిన సందర్భంలో కూడా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే తాను పార్టీ మారడానికి గల కారణాలను సైతం చదలవాడ ఏకరువుపెట్టారు. తిరుపతిలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. స్వయంగా ఓ ఎమ్మెల్యేనే భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేరు చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యేలా ఎమ్మెల్యే సుగుణమ్మపై విరుచుకుపడ్డారు. తిరుచానూరు రోడ్డులో ఎమ్మెల్యే సుగుణమ్మ స్వాధీనంలో ఉన్న భూమిలో బస్టాండ్ ఏర్పాటుచేయాలని తాను సీఎంను కోరాననీ, కానీ ఆయన పట్టించుకోలేదనీ అన్నారు. అలాగే రేణిగుంట రోడ్డులో చదలవాడ విద్యాసంస్థలున్న మోపెడ్స్ ప్రాంతంలోని కొంత భూమిని గతంలో సుగుణమ్మ భర్త దివంగత వెంకటరమణ ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర రెండు ఎకరాలకు గోడకట్టేశారనీ, నిజానికి ఆ స్థలాన్ని అలా ఆక్రమించడం ఎలా సమర్థనీయమని” ఆయన ప్రశ్నించారు. తిరుమల దర్శనాల్లోనూ అవినీతి జరుగుతోందని చదలవాడ ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు. అయితే చదలవాడ ఆరోపణలపై ఎమ్మెల్యే సుగుణమ్మ చాలా సీరియస్ అయ్యారు. కాపు సామాజికవర్గీయుడిగా తనకు అండగా ఉంటారనుకున్న చదలవాడ తనపైనే ఆరోపణాస్త్రాలు సంధించడంతో ఆమె మనస్తాపం చెందారు. వాటిని ఎదుర్కోక తప్పదనుకున్నారో ఏమో.. ఆమె కూడా ప్రత్యారోపణలకు దిగారు. తమ స్థలంలో బస్టాండ్ కట్టమని చెప్పడానికి కృష్ణమూర్తి ఎవరని నిలదీశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా ఆయనే భవనం కడుతున్నారని ఆరోపించారు. మోపెడ్స్ దగ్గర భూమి కబ్జా చేసింది చదలవాడే అన్నారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తమకున్న 250 గజాలు వారసత్వంగా వచ్చిన ఆస్తి అని వివరణ ఇచ్చారు. చదలవాడ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన ఇంటిముందు, థియేటర్ల ఎదుట ధర్నాకు దిగుతానని సుగుణమ్మ హెచ్చరించారు.తిరుపతిలో ఇలా ఇద్దరు నాయకుల మధ్య గొడవలు ఇలా తారస్థాయికి చేరడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అందులోనూ ఇద్దరూ ప్రస్తుతం చెరొక పార్టీలో ఉన్నందున ఈ గొడవలు ఎటు దారితీస్తాయోనని ఇరువర్గాల వారు ఆందోళన చెందుతున్నారు. చూద్దాం- టెంపుల్ సిటీలో రాజకీయం ఎలా మారబోతుందో!

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here