రఫేల్‌ ఒప్పందంపై రాజకీయ దుమారం

0
225

దిల్లీ: రఫేల్‌ ఒప్పందంపై రాజకీయ దుమారం రేగిన వేళ ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. రఫేల్‌ ఒప్పందానికి అయిన ఖర్చు, యుద్ధ విమానాల ధర తదితర పూర్తి వివరాలను 10రోజుల్లోగా సీల్డ్ కవర్‌లో సమర్పించాలని న్యాయస్థానం అడిగింది. అయితే ఈ వివరాలను బహిర్గతం చేయలేమని కేంద్రం వెల్లడించింది.

‘ఒప్పందం విలువ, యుద్ధ విమానాల ధరకు సంబంధించిన వివరాలను సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించాలి. రానున్న 10 రోజుల్లో ఇది జరగాలి’ అని జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి సూచించింది. అయితే కేవలం ధరకు సంబంధించిన వివరాలు మాత్రమే తాము అడుగుతున్నామని, సాంకేతికపరమైన వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ యుద్ధవిమానాల ధర చాలా ప్రత్యేకమైనదని, దీన్ని న్యాయస్థానంతో పంచుకోలేమని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. దీంతో ఒప్పందం వివరాలను పంచుకోలేమని చెప్పే అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించాలని కోర్టు సూచించింది. దీనిపై తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది.

రఫేల్ ఒప్పందంలో భారీ కుంభకోణం దాగిఉందని గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఫేల్‌ ఒప్పందం కోసం అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. రఫేల్ ఒప్పందం వివాదం తీవ్ర రూపం దాల్చడంతో దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here