బాబు బాటలో పవన్‌..!

0
82

హోదా కోసం టీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకోవాలంటూ టీడీపీ, వైఎస్సార్‌ సీపీకి జనసేన అధినేతే సూచన

ఎనిమిది నెలల కిత్రం ఆయన మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

ఈ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పై విమర్శల వెల్లువ

చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నప్పడల్లా.. అదే బాటలో పవన్‌ 

సాక్షి,అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు టీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతు పలికిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు  ప్రత్యేక హోదా సాధించడానికి టీఆర్‌ఎస్‌ సహకారం తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను’.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీతో ఎన్నికల పొత్తుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలవి. రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన సొంత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ‘యూటర్న్‌’ తీసుకోవడానికి అనుగుణంగానే పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు తన మాట మార్చుకున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ మూడు నెలల కిత్రం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు నిరాకరించి ఒంటరి పోరుకు సిద్ధపడిన నాటి నుంచి చంద్రబాబు ఆ పార్టీ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ప్రతీ బహిరంగ సభలోనూ విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతీఎన్నికల సభలో చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సీఎంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుండకపోయినా.. పవన్‌కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీ రహస్య మిత్రుడేనని ప్రచారం జరుగుతున్నట్లుగానే.. జనసేన పార్టీ అధినేత కూడా అచ్చం చంద్రబాబు మాదిరే ఇప్పుడు ప్రతీ ఎన్నికల సభలో కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అచ్చం చంద్రబాబు నోటి వెంట వచ్చే మాటలనే ఆయన వల్లె వేయడంపై సోషల్‌ మీడియాలో సైటర్లు పేలుతున్నాయి. కాగా, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకోవాలని ఎనిమిది నెలల కిత్రం పవన్‌కల్యాణ్‌ మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here