సోషల్ మీడియా అంచనాలను చేరుకోలేకపోతున్న తెలంగాణ మంత్రులు!

0
119

  • సోషల్ మీడియా ఖాతాలు లేని ముగ్గురు మంత్రులు
  • ఉన్నవారు స్పందించే తీరూ నామమాత్రమే
  • ట్వీట్లలో తలసాని 9, మహమూద్ అలీ 32, ఈటల 57కు పరిమితం
  • మంత్రిగా లేకున్నా సమస్యలన్నీ కేటీఆర్ చెంతకే

అవి పాడైపోయిన రోడ్ల సమస్య అయినా, వైద్య సాయమైనా, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన విషయాలైనా… తన వద్దకు వచ్చిన ఎటువంటి విషయాన్ని అయినా పరిష్కరించేందుకు కేటీఆర్ ముందుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మాత్రమే ఆయన ఉన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయనకు స్థానం ఇంకా లభించలేదన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ప్రస్తావించగా, “నేను ఒక ఎన్నికైన ప్రజా ప్రతినిధిని. నా దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళుతున్నాను. ఇందులో ఎవరికి ఏ సమస్య ఉంది?” అని ప్రశ్నించారు.

ఇక మంత్రిగా లేని కేటీఆర్, ఇంతలా ప్రజలతో మమేకమైతే, మంత్రి పదవుల్లో ఉన్నవారు అలా లేరన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత కేసీఆర్ మంత్రివర్గంలో ఇద్దరు, ముగ్గురికి మినహా మిగతా అందరికీ సోషల్ మీడియా ఖాతాలు ఉన్నప్పటికీ, వాటిని వినియోగించుకుంటున్న వారు లేరనే చెప్పాలి. 2004లో ట్విట్టర్ లో చేరిన మహమూద్ అలీ, ఇప్పటివరకూ 32 ట్వీట్లను మాత్రమే చేయగా, అదే సంవత్సరం చేరిన ఈటల రాజేందర్ 57 ట్వీట్లకు పరిమితం కాగా, ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం కాస్తంత ముందుండి 1,282 ట్వీట్లు చేశారు. 2016లో ట్విట్టర్ చేరిన తలసాని ఇప్పటివరకూ చేసిన ట్వీట్లు 9 మాత్రమే. 2018లో చేరిన ఎస్ నిరంజన్ రెడ్డి 848 ట్వీట్లు చేశారు. వీ శ్రీనివాస్ గౌడ్ 3,214 ట్వీట్లు, కొప్పుల ఈశ్వర్ 491 ట్వీట్లు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, వీ ప్రశాంత్ రెడ్డి, జీ జగదీశ్ రెడ్డిలకు అసలు ట్విట్టర్ ఖాతాలే లేవు.

ఇప్పుడున్న 12 మంది మంత్రుల్లో చాలా మందిని తాను మంత్రిగా ఉన్న సమయంలోనే కేటీఆర్, సోషల్ మీడియాలో చేర్చించారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే క్రమంలో సామాజిక మాధ్యమాలు ఎంతో సానుకూల వాతావరణం కల్పిస్తాయని వ్యాఖ్యానించిన తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడం అంత సులువేమీ కాదని అభిప్రాయపడ్డారు. మంత్రులు, ప్రజల మధ్య మరింత మెరుగైన సంబంధాల కోసం సోషల్ మీడియాను వాడేలా చూడనున్నామని అన్నారు. అందుకోసం అధికారులతో ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోందని చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here