చంద్రగిరి నుంచి షిర్డీకి చెవిరెడ్డి ప్రత్యేక రైలు.. మద్యం తాగుతూ, పేకాడుతూ అనుచరుల హల్‌చల్

0
43

  • నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లలో ఆదివారం రీపోలింగ్
  • ఆయా గ్రామాల వైసీపీ కార్యకర్తలు, నాయకులను షిర్డీ పంపిన చెవిరెడ్డి
  • ప్లాట్‌ఫాంపైనే తాగుతూ చిందేసిన అనుచరులు

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు బూత్‌లలో రీపోలింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న నేపథ్యంలో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. నాయకులను తనవైపు తిప్పుకునే ఉద్దేశంలో భాగంగా చంద్రగిరి నుంచి షిర్డీకి ప్రత్యేకంగా ఓ రైలు బోగీని బుక్ చేసి అందులో వారిని పంపారు. రైలులో భోజనం మొదలుకుని ‘అన్ని’ ఏర్పాట్లు చేశారు. ఇక రైలు ఎక్కిన చెవిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. బహిరంగంగానే మద్యం తాగుతూ, పేకాడుతూ నానా హంగామా చేశారు.

గురువారం ఉదయం పదిన్నర గంటలకు రైలు షిర్డీకి బయలుదేరింది. రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైలు అరగంటపాటు ఆగడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు పరుగుపరుగున బయటకు వెళ్లి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. మద్యం చేతికి అందిన వెంటనే కొందరు తమ సీట్లలో కూర్చుని పని కానిచ్చేయగా, కొందరు దర్జాగా ప్లాట్‌ఫాం పైనే మద్యం తాగారు. వీరి చేష్టలను చూస్తున్న రైల్వే పోలీసులు వారిని వారించకపోవడంతో ఇతర ప్రయాణికులు ముక్కున వేలేసుకున్నారు.

నేడు షిర్డీలో వీరికి దర్శనం పూర్తయిన అనంతరం శనివారం తిరిగి చంద్రగిరికి తీసుకురానున్నారు. ఆదివారం పులివర్తిపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, ఎన్‌ఆర్‌ కమ్మపల్లి గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది. చెవిరెడ్డి రైలులో యాత్రకు వెళ్లిన వారిలో ఈ గ్రామాల ప్రజలు, నాయకులు ఉన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here