నా కుమారుడిని బెస్ట్ పెర్ఫార్మర్‌గా హీరో సంస్థ గుర్తించింది: కోడెల

0
73

  • అక్రమంగా కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు
  • నా కుటుంబంపై చేస్తున్న ఆరోపణలపై ఒక్క ఆధారం చూపించండి
  • అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోం

తన కుమారుడు, కుమార్తెలపై పెడుతున్న కేసులపై ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న విమర్శలపై వివరణ ఇచ్చారు. తన కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టుకుంటూ పోతున్నారని, ఇప్పటికే ఏడెనిమిది కేసులు పెట్టారని అన్నారు.

తన కుమారుడు వైద్యుడని, ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నాడని తెలిపారు. ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్టు చెప్పారు. గౌతం హీరో షోరూం పేరుతో ద్విచక్ర వాహనాల షోరూం ఉందని పేర్కొన్నారు. తన కుమారుడిని హీరో సంస్థ ఉత్తమ పారిశ్రామికవేత్తగా గుర్తించిందని తెలిపారు. అలవెన్సులు ఇచ్చి సింగపూర్‌లో కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించినట్టు తెలిపారు.

అలాగే, తమ భవనాలను ప్రభుత్వానికి అత్యధిక ధరకు అద్దెకు ఇచ్చినట్టు వస్తున్న ఆరోపణలను కూడా కోడెల ఖండించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అద్దె చెల్లిస్తున్నారని, అప్పట్లో కేవలం రూ.20లుగా నిర్ణయించారని, జీఎస్టీ పోను తమకు వస్తున్నది రూ.15 మాత్రమేనన్నారు. తమ మల్టీప్లెక్స్ మాల్‌ కూడా నిబంధనల ప్రకారమే ఉందన్నారు. ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించే పని చేయలేదని కోడెల పేర్కొన్నారు. తన కుమార్తె ఫార్మా కంపెనీ ద్వారా, కుమారుడి హీరో షోరూం ద్వారా 400 మందికి ఉపాధి కల్పించామని, ఇప్పుడు వారి పొట్ట కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు.

తమను బెదిరించి తప్పుడు కేసులు పెడుతున్నారని కోడెల ఆరోపించారు. తమపై చేసే ఏ ఒక్క ఆరోపణకైనా ఒక్క ఆధారం చూపించాలని డిమాండ్ చేశారు. కేసులకు బెదిరిపోబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంచి చేస్తే తాము కూడా మద్దతు ఇస్తామని, కానీ ఇలాంటి బెదిరింపు ధోరణి సరికాదని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని అక్రమాలకు పాల్పడినా, వేధింపులకు గురిచేసినా అందరం కలిసికట్టుగా పోరాడతామని కోడెల హెచ్చరించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here