నాకు రెండేళ్లు టైమ్ ఇవ్వండి.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తా!: ఏపీ సీఎం జగన్

0
79

  • ప్రభుత్వ స్కూళ్లు అధ్వానంగా ఉన్నాయి
  • ప్రతీ పాఠశాలను ఇంగ్లిష్ మీడియంగా మారుస్తాం
  • ప్రతీ స్కూలులో తెలుగు భాషను తప్పనిసరిగా చేస్తాం
  • గుంటూరులో ‘రాజన్న బడిబాట’లో పాల్గొన్న ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా తయారు అయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. చాలా పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీటితో పాటు మరుగుదొడ్లలో నీటి సౌకర్యం కూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చాలా పాఠశాలల్లో ఫ్యాన్లు తిరగవనీ, ప్రహరి గోడలు ఉండవని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పెనుమాకలో ఈరోజు నిర్వహించిన ‘రాజన్న బడిబాట’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంత అధ్వానంగా తయారు అయ్యాయి కాబట్టే ఏ తండ్రి, తల్లి అయినా తమ పిల్లలను గవర్నమెంటు పాఠశాలలకు పంపడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చిందని ఆరోపించారు. ‘నారాయణ పాఠశాలలు, శ్రీచైతన్య పాఠశాలలను గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. ఆ ప్రైవేటు స్కూళ్ల ఫీజులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఎల్ కేజీలో పిల్లాడిని, పాపను చేర్పించాలంటే రూ.20,000 అడుగుతున్నారు. మరికొన్ని స్కూళ్లలో అయితే నా కళ్ల ఎదుటనే రూ.40,000 తీసుకుంటున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలను చదవించుకోవాలంటే తల్లిదండ్రులు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి.

ఇవన్నీ మార్చేస్తామని నేను మీకు మాట ఇస్తున్నా. ఇక్కడకు వచ్చేముందు నేను అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించాను. ప్రతీ స్కూలుకు సంబంధించిన ఫొటోలు తీయండి అని ఆదేశించాను. ఇప్పుడు ఆ స్కూళ్లు ఎలా ఉన్నాయో ప్రజలకు చూపిస్తాం. నేను ప్రజలను 2 సంవత్సరాల సమయం అడుగుతున్నాను. ఈ రెండేళ్లలో స్కూళ్లను అభివృద్ధి చేసి మళ్లీ మీకు ఫొటోలు చూపిస్తాను. పాఠశాలల్లో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తాం. ప్రతీ పాఠశాల ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారాలి. దేశవ్యాప్తంగా మన పిల్లలు పోటీపడే పరిస్థితి రావాలి. ఇందుకు ప్రతీ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం రావాలి. అదే సమయంతో ప్రతీ స్కూలులో తెలుగును తప్పనిసరి చేస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here