పొద్దు ఎరగని కొత్త బిచ్చగాడి తరహాలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది!: గోరంట్ల బుచ్చయ్యచౌదరి

0
56

  • గ్రామసచివాలయ ఉద్యోగాలకు అర్హతలు చెప్పట్లేదు
  • వైసీపీ కార్యకర్తలతో నింపడానికి ప్రయత్నిస్తున్నారు
  • అసెంబ్లీ మీడియా పాయింట్ లో టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల దగ్గరి నుంచి ఏ ఉద్యోగానికి అయినా కొన్ని నిబంధనలు ఉంటాయని టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిబంధనలు చూపకుండా అర్హతల గురించి చెప్పకుండా గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోందని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగాల్లో నింపడానికే ఈ ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి గోరంట్ల మీడియాతో మాట్లాడారు.

ఇక పెన్షన్ల విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం కారణంగా ప్రతీ అవ్వాతాత రాబోయే ఐదేళ్లలో రూ.18,000 కోల్పోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. విడతలవారీగా పెన్షన్ పెంచుతామని చెప్పి ఏదో సాధించామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ చెక్కులకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉందనీ, ఆ చెక్కులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుబంధు పథకం కింద రూ.4,500 కోట్లను టీడీపీ ప్రభుత్వం చెల్లించిందనీ, కానీ వైసీపీ ప్రభుత్వం రెండో విడతను రద్దు చేసిందని మండిపడ్డారు. బలహీనవర్గాలకు యాక్షన్ ప్లాన్, ఆర్థిక ప్రగతి, ఆర్థిక సమస్యలపై ఎలాంటి ప్రణాళిక లేకుండా గవర్నర్ ప్రసంగం చప్పగా సాగిందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరు పొద్దెరగని కొత్త బిచ్చగాడి రీతిలో ఉందని దుయ్యబట్టారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here