దుస్తుల వద్ద పేచీ… పెళ్లయిన గంటల వ్యవధిలో విడాకులు!

0
68

  • జార్ఖండ్ లోని పిండారీ ప్రాంతంలో ఘటన
  • పెట్టిన బట్టలు పాతవని వధువు బంధువుల గొడవ
  • కట్నకానుకలు వెనక్కిచ్చిన వరుడి తల్లిదండ్రులు

పెళ్లి వేడుక సమయంలో తనకు పాత బట్టలు పెట్టారన్న ఆగ్రహంతో ఓ వధువు, గంటల వ్యవధిలోనే విడాకులు తీసుకున్న ఘటన ఇది. పాత బట్టలు పెట్టిన వరుడి తరఫువారిలో 150 మందిని వధువు బంధువులు బంధించగా, స్థానిక మంత్రి స్వయంగా కల్పించుకుని పంచాయితీ చేసి, సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. ఈ ఘటన జార్ఖండ్ లోని పిడారీ గ్రామంలో జరిగింది.

స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన నౌషద్ అన్సారీ కుమార్తెకు ఖుర్షిద్ అన్సారీ కుమారుడు ఆరీఫ్ అన్సారీతో పెద్దలు పెళ్లిని నిశ్చయించారు. పెళ్లికి ముందే కట్న కానుకల కింద రూ. 3 లక్షలకు పైగా వధువు తరపువారు మగపెళ్లివారికి అందించారు. ముందుగా అనుకున్న విధంగానే నిఖా పూర్తయ్యింది. సంప్రదాయం ప్రకారం, వరుడి తరఫున వధువుకు దుస్తులను ఇవ్వగా, అవి పాతవని, వాడేసినవి తమకు ఇచ్చారని వధువు తరఫు బంధుమిత్రులు గొడవకు దిగారు.

ఇక వధువైతే ఇటువంటి పెళ్లి తనకు వద్దని భీష్మించుకు కూర్చుంది. నిఖాను రద్దు చేయాలంటూ  పట్టుబట్టింది. తామిచ్చిన డబ్బు వెనక్కు ఇవ్వాలని వధువు తరఫువారు వరుడి బంధువులను బంధించడంతో, స్థానిక ఎమ్మెల్యే, ఆ ప్రాంత మంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. వారు వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడి, నిఖాను రద్దు చేసి, కట్నకానుకల కింద ఇచ్చిన సొమ్మును వధువు తల్లిదండ్రులకు తిరిగి ఇప్పించారు. ఈ విషయం తమకు తెలుసునని, అయితే, సమస్య పరిష్కారం కావడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించడం గమనార్హం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here