చైనాకు వ్యతిరేకంగా 22 పాశ్చాత్య దేశాలు… మద్దతుగా నిలిచిన 37 దేశాలు

0
74

  • జిన్ జియాంగ్ లో ఉయ్ ఘర్లు, ముస్లింలపై చైనా ఉక్కుపాదం
  • మావన హక్కుల హననాన్ని ఆపేయాలన్న 22 దేశాలు
  • మానవ హక్కులను చైనా గౌరవించిందన్న 37 దేశాలు

మావన హక్కుల పరిరక్షణకు చైనా కట్టుబడి ఉందంటూ పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా 37 దేశాలు తెలిపాయి. వివరాల్లోకి వెళ్తే, చైనాలోని పశ్చిమ జిన్ జయాంగ్ ప్రాంతంలో ఉయ్ ఘర్ లతో పాటు ఇతర ముస్లింలపై చైనా అరాచకాలకు, సామూహిక అణచివేతకు పాల్పడుతోందంటూ ఈనెల 10వ తేదీన యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ తదితర 22 దేశాలు ఆరోపించాయి. మానవహక్కుల హననాన్ని చైనా వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశాయి.

ఈ దేశాల ఆరోపణలకు సమాధానంగా ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్, సౌదీఅరేబియా, నైజీరియా, అల్జీరియా, రష్యా, ఉత్తరకొరియా తదితర 37 దేశాలకు చెందిన ప్రతినిధులు చైనాకు మద్దతుగా ఒక లేఖను విడుదల చేశారు. ‘ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత పరమైన తీవ్రవాదాన్ని జిన్ జియాంగ్ లో చైనా ఎదుర్కొంటోంది. అయితే కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలు, అక్కడ నివసిస్తున్న వారిని చైతన్యవంతులను చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చైనా చేసింది. కౌంటర్ టెర్రరిజం, డీ రాడికలైజేషన్ ద్వారా మానవ హక్కులను చైనా గౌరవించింది, కాపాడిందనే విషయాన్ని అందరి దృష్టికి తీసుకొస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు దీనిపై చైనా స్పందిస్తూ… పాశ్చాత్య దేశాలు, అక్కడి మీడియా వాస్తవాలను వక్రీకరిస్తున్నారయని విమర్శించింది. జిన్ జియాంగ్ లోని ప్రజలు ఇప్పుడు ఎంతో సంతోషంగా, సురక్షితంగా ఉన్నారని తెలిపింది.

ఇంకోవైపు, జిన్ జియాంగ్ లో నిర్భంధ గృహాలను ఏర్పాటు చేశారంటూ చైనాపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, వీటిని చైనా వెనకేసుకొస్తోంది. వీటిని విద్యా కేంద్రాలుగా చెప్పుకుంటూ వస్తోంది. ఈ కేంద్రాల్లో ఇస్తున్న ట్రైనింగ్ కారణంగా అక్కడి ప్రజలు తీవ్రవాద భావజాలానికి దూరమవుతున్నారని, వారికి కొత్త స్కిల్స్ నేర్పిస్తున్నామని చెబుతోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here