1 నుంచి 1000 నంబర్లు సరిగ్గా రాస్తే రూ. 50… భారీ మోసానికి తెరలేపిన కిలేడీ!

0
74

  • హైదరాబాద్, కార్ఖానా కేంద్రంగా మోసం
  • తొలుత డబ్బులిచ్చి, నమ్మించి, ఆపై మోసం
  • అరెస్ట్ చేసిన పోలీసులు

నిరుద్యోగులే ఆమె టార్గెట్. ఏ ఉపాధీ లేకుండా ఖాళీగా ఉన్నవారిని ఆకర్షించి, వారిని బుట్టలో వేసుకుని తేలికైన పని చెప్పి, మొదట్లో డబ్బులు ఇస్తూ, ఆకట్టుకుని భారీ మొత్తంలో డబ్బు లేపేసిందో కిలేడీ. హైదరాబాద్, మల్కాజిగిరి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, చిలకలగూడకు మునుకుల షాలిని (24) బీకాం వరకూ చదివింది. ఆమె తమ్ముడు ఆటోడ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. గడచిన మేలో ఖైరతాబాద్‌ లో ఓ వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యాలయంలో చేరిన ఆమె, డబ్బులు కట్టించుకుని కాగితాలపై నంబర్లు వేయించుకుని చెల్లింపులు చేసే పద్ధతిని చూసింది.

ఆపై నెల రోజుల తరువాత ఉద్యోగం మానేసి, తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలన్న టార్గెట్ పెట్టుకుని కార్ఖానాలో జూన్ లో ఓ ఆఫీస్ ను ప్రారంభించింది. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటూ, రిజిస్ట్రేషన్‌ కోసం రూ. 2,500 కట్టించుకుంది. ఐడీ కార్డు ఇస్తామని ఇంకొంత వసూలు చేసింది. వైట్ పేపర్ పై గళ్లు గీసి, ఒకటి నుంచి వెయ్యి వరకూ అంకెలను తప్పుల్లేకుండా వేయాలని చెప్పి, 90 పేపర్లు సక్రమంగా వేసివ్వాలని చెప్పింది. సరిగ్గా వేసిన ఒక్కో పేపరుకు రూ. 50 చొప్పున షాలినీ చెల్లిస్తుండటంతో, ఎంతో మంది ఆశపడి చేరారు.

తొలుత డబ్బులను సక్రమంగా ఇచ్చిన షాలిని, తరువాత డబ్బులు ఎగ్గొట్టింది. ఇలా దాదాపు 100 మందిని మోసం చేసింది. ఆపై జూలైలో ఆర్కేనగర్‌లో మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, 80 మందిని మోసం చేసింది. తన మోసాలకు సహాయం చేసేందుకు బర్గే బాలరాజ్‌ (32) అనే వ్యక్తిని సహాయకుడిగా నియమించుకుంది. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో, మోసం జరుగుతోందని గుర్తించిన కొందరు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, విచారించిన పోలీసులు షాలిని, బాలరాజ్ లను అరెస్ట్ చేశారు. వారి ఆఫీసుల్లోని రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here