ఫోర్జరీ సంతకాలతో బంధువుల ఆస్తులపై రుణం.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

0
11

  • నమ్మి ఆస్తి పత్రాలు అప్పగిస్తే మోసం
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు
  • ఒక కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి…విచారణలో మరోకేసు

దగ్గర బంధువే కదా అని నమ్మి ఆస్తి పత్రాలు అప్పగిస్తే ఫోర్జరీ సంతకాలతో  రెండు వేర్వేరు బ్యాంకుల్లో  వాటిపై  రూ.27 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన వ్యక్తికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు…హైదరాబాద్‌లో ఉంటున్న కె.హరిబాబు పదేళ్ల క్రితం కొన్ని కంపెనీలకు ఆర్థిక సలహాదారుడిగా పనిచేసేవాడు. ఆయా కంపెనీల లావాదేవీలపై అవగాహన కలిగాక తానూ ఓ కంపెనీ స్థాపించాలనుకున్నాడు.

ఇందుకు రూ.15 కోట్లు అవసరం కాగా, రూ.6 కోట్లే అతనివద్ద ఉన్నాయి. మిగిలిన నిధుల కోసం భార్య పద్మజారాణి సోదరి వనజారాణిని సంప్రదించి ఆమె ఆస్తి పత్రాలు అడిగాడు. బంధువే కదా అని ఆమె ఆస్తిపత్రాలు ఇవ్వగా డీసీబీ బ్యాంకులో వాటిని తనఖా ఉంచి రూ.15 కోట్ల రుణం తీసుకున్నాడు. ఇందులో రూ.9 కోట్లు తీర్చేశాడు.  ఆ తర్వాతే హరిబాబుకు దురాశపుట్టింది.

ఎలాగూ వదిన నమ్మింది అన్న ఉద్దేశంతో ఆమెకు తెలియకుండా ఆమె సంతకాలు ఫోర్జరీచేసి అవే ఆస్తిపత్రాలపై మరోసారి రుణం తీసుకున్నాడు. కానీ కంపెనీకి నష్టాలు రావడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో బ్యాంకులు వనజారాణికి నోటీసులు పంపాయి. దీంతో కంగుతిన్న ఆమె విషయం మరిది వద్ద ప్రస్తావించింది. ఆయన నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రెండేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అప్పట్లో పోలీసులు హరిబాబును అరెస్టు చేయగా బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా ఈ కేసు విచారించిన న్యాయమూర్తి హరిబాబుకు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. కాగా, హరిబాబు తన అత్త పేరున ఉన్న ఇంటిని కూడా ఫోర్జరీ సంతకాలతో తాకట్టుపెట్టి మరో రూ.18 కోట్ల రుణం తీసుకున్న కేసు నడుస్తుండడం గమనార్హం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here