370 ఆర్టికల్‌ రద్దు నిర్ణయంలో మార్పు ఉండదు : ఐరాసాలో భారత్‌ శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌

0
96

  • మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం
  • దీనివల్ల కశ్మీర్‌ ప్రజలకు మేలు జరుగుతుంది
  • ఈ విషయంలో బయట దేశాల జోక్యాన్ని అంగీకరించం

అభివృద్ధికి దూరమై పేదరికంతో మగ్గిపోతున్న జమ్ముకశ్మీర్‌ ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాలన్న మంచి ఉద్దేశంతోనే ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణ రద్దు చేశామని, ఈ నిర్ణయం విషయంలో ఎటువంటి మార్పు ఉండదని ఐక్యరాజ్య సమితిలో భారత్‌ శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తెలిపారు. ఈ అంశం విషయంలో బయట దేశాల జోక్యాన్ని కూడా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కశ్మీర్‌పై నిన్న ఐక్యరాజ్య సమితి రహస్య భేటీ నేపథ్యంలో భారత్‌ తరపున ఆయన ఈ ప్రకటన చేశారు.

‘కశ్మీర్‌లో ఏదో జరిగిపోతోందన్న తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. వారి ఆరోపణలు పూర్తిగా సత్యదూరం’ అని పరోక్షంగా పాకిస్థాన్‌కు చురకంటించారు. కశ్మీర్‌పై ఆ దేశం ఎంత గగ్గోలు పెట్టినా నిరుపయోగమేనన్నారు. ఉగ్రవాదానికి స్వస్తిపలికితేనే పాకిస్థాన్‌తో చర్చలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.

కాగా, కశ్మీర్‌ సమస్యను విశ్వవేదికపై ప్రస్తావించగలిగామని ఐరాసా సమావేశాన్ని అడ్డం పెట్టుకుని పాకిస్థాన్‌ గొప్పలు చెప్పుకున్నా ఆ దేశ పత్రికలు మాత్రం చైనా తప్ప మరే దేశం పాకిస్థాన్‌కు బాసటగా నిలవలేదని వార్తలు ప్రచురించడం గమనార్హం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here